కామారెడ్డి/వినాయక్‌నగర్, ఆగస్టు 2 : ఉమ్మడి జిల్లాలో పోలీసులు జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా ముగిసింది. నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు కామారెడ్డిలో 45 మంది, నిజామాబాద్‌లో 119మంది బాలలను గుర్తించారు. ఇందులో 160 మంది బాలలు, నలుగురు బాలికలు ఉన్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మూడు డివిజన్లలో ఆయా శాఖల అధికారులతో కలిసి మూడు బృందాలుగా ఏర్పడి రైల్వేస్టేషన్, బస్టాండ్, జనం రద్దీగా ఉండే ప్రదేశాలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టి కామారెడ్డి సబ్ డివిజన్లో 13 మంది, ఎల్లారెడ్డి డివిజన్లో 10 మంది,బాన్సువాడ డివిజన్లో 22 మందిని గుర్తించారు. పిల్లలను పనిలో పెట్టుకొని వారితో పని చేయిస్తున్న వారిపై 23 కేసులు నమోదుచేశారు. కామారెడ్డి డివిజన్లో 11, ఎల్లారెడ్డి డివిజన్లో నాలుగు, బాన్సువాడ డివిజన్ లో 8 కేసులు నమోదుచేశారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 119 మంది బాలలను గుర్తించారు. ఇందులో నిజామాబాద్ సబ్‌డివిజన్ పరిధిలో 43 మంది, బోధన్ సబ్‌డివిజన్ పరిధిలో 49, ఆర్మూర్ బోధన్ సబ్‌డివిజన్ పరిధిలో 27 మంది ఉన్నారు. నిజామాబాద్ డివిజన్లో 19, ఆర్మూర్ డివిజన్లో 15, బోధన్ డివిజన్లో 14 కేసులు నమోదు చేశారు. తప్పిపోయిన పిల్లల వివరాలను ‘ట్రాక్ చైల్డ్’లో నమోదు చేసి వారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. బాలలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానా విధిస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర హెచ్చరించారు.