జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 2,(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు కనీస వసతులు కరువయ్యాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి రిఫరల్ సెంటర్‌గా మారిందని విమర్శించారు. ఆదివారం భూపాలపల్లిలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. దవాఖానలోని వార్డులను పరిశీలించగా, రోగులు రమణారెడ్డి వద్దకొచ్చి ఆస్పత్రిలో అసౌకర్యాలపై ఆవేదన చెందారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో రోగులకు వరంగా ఉన్న పెద్దాసుపత్రి నేడు శాపంగా మారిందని మండిపడ్డారు. జిల్లాతో పాటు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ర్టాల నుంచి వచ్చే పేదలకు అత్యవసర వైద్య సేవలందించే దవాఖాన ప్రస్తుతం సమస్యలకు నిలయంగా మారిందన్నారు.
బీఆర్ఎస్ పాలనలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దవాఖానలో రోగులకు మెరుగైన వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిచామన్నారు. అవసరమైన మేరకు వైద్యులను నియమించి నిరంతరం పర్యవేక్షించామన్నారు. అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రులంటే ప్రజలకు భరోసా కల్పించామని తెలిపారు. కరోనా సమయంలోనూ నాటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రోగులకు మెరుగైన వైద్యం అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడమని గుర్తు చేశారు. కానీ నేటి కాంగ్రెస్ పాలనలో సరారు వైద్యం కుంటుపడిందని, భూపాలపల్లి జిల్లా జనరల్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించకుండా ఇతర ఆసుపత్రులకు వైద్యులు, సిబ్బంది రిఫర్ చేస్తున్నారనే ఫిర్యాదులు తమకు నిత్యం అందుతున్నాయన్నారు. రోగుల ఫిర్యాదులు వింటుంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రినా…? లేక రిఫరల్ సెంటరా…? అనే అనుమానాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో తొమ్మిది నెలలుగా మంచినీటి సమస్య నెలకొందని, నాలుగు బోర్లకు ఒక్క బోరు మాత్రమే పనిచేస్తుండడంతో రోగులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు.
ఐదు రోజుల నుంచి నీటి సరఫరా నిలిచిపోయినా సర్కారుతోపాటు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. బోర్లను రిపేరు చేయించే దమ్ము ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ట్రాన్స్ఫార్మర్ నిరుపయోగంగా ఉందని, మరుగుదొడ్లు అపరిశుభ్రతతో అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. సరిపడా వైద్యులు లేరని, సూపరింటెండెంట్ తన ఇష్టానుసారంగా ఆర్ఎంలుగా ప్రమోట్ చేసి తన ఆఫీస్ పనులకు వాడుకోవడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో కూర్చొని ఎమ్మారై సాన్ ప్రారంభించాడు తప్ప అవసరమైన డాక్టర్‌ను నియమించకపోవడంతో సేవలు అందడం లేదన్నారు. ఆసుపత్రిలో కండోమ్స్ కనిపించడంతో గండ్ర వైద్యులు, సూపర్వైజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ పనిచేయక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని వినియోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భూపాలపల్లి ఆసుపత్రిని తనిఖీ చేసి అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. తాగునీటి సమస్యను పరిష్కరించి రోగులకు అవసరమైన మెడిసిన్, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ మాజీ అధ్యక్షుడు కటకం జనార్ధన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు కట్ల పూర్ణచందర్, నరేందర్, బొంతల సతీశ్‌కుమార్, మోతె రాజుపటేల్, టీబీజీకేఎస్ బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, నాయకులు మాడ హరీశ్‌రెడ్డి, మామిడి కుమార్, పోలవేని అశోక్, ఐలయ్య, జక్కం రవికుమార్, పిల్లమర్రి నారాయణ, చిరంజీవి, మురళీధర్, బాలరాజు గౌడ్, వాసాల రవి, ఎం రాజేందర్, శ్రీనివాస్, నాయకులు యుగేంద్రచారి, దిలీప్‌కుమార్, మహేందర్, బెజ్జల వంశీ, రాకేశ్, టీబీజీకేఎస్ నాయులు అవినాష్‌రెడ్డి, దేవకొండ మధు, కుమారస్వామి, మహిళా నాయకులు పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.