స్వరాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేరాయి. పుట్టబోయే బిడ్డ నుంచి పండుముసలి వరకు ప్రతి ఒక్కరి సంక్షేమానికి కేసీఆర్ సర్కారు పాటు పడుతున్నది. ఉమ్మడి జిల్లాలోని వేలాది కుటుంబాలకు ప్రభుత్వం ఆహార భద్రత కల్పిస్తున్నది. లక్షలాది మందికి ‘ఆసరా’గా నిలుస్తున్నది. కులవృత్తుల పూర్వవైభవానికి వినూత్న పథకాలను అమలు చేస్తున్నది. ‘కల్యాణలక్ష్మి’తో నిరుపేదల ఇండ్లకు పెండ్లికాంతులు తీసుకొస్తున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఊరూరా సంక్షేమ సంబురాలు నిర్వహించనున్నది.
కామారెడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించిన సీఎం కేసీఆర్.. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలుచేస్తూ, సింహభాగం నిధులను వెచ్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు (శుక్రవారం) నియోజకవర్గాల్లో తెలంగాణ సంక్షేమ సంబురాలను నిర్వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇప్పటివరకు వెచ్చించిన నిధులు, లబ్ధిదారుల వివరాలపై కథనం..
ఆహార భద్రత పథకం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రతి కుటుంబసభ్యుడికి 4 కేజీల చొప్పున, ప్రతి కుటుంబానికీ గరిష్ఠంగా 20 కేజీల బియ్యం పంపిణీ చేసేవారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి 4 కిలోల చొప్పున పంపిణీ చేశారు. ఆ తర్వాత దానిని 6 కిలోలకు పెంచారు. జిల్లాలో 2,53,479 రేషన్ కార్డుల ద్వారా 8,61,683 మంది లబ్ధిదారులకు నెలకు 5,490 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు.
ఆసరా పథకం..
ఉమ్మడి రాష్ట్రంలో అర్హులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. సదరు గ్రామంలో ఎవరైనా లబ్ధిదారులు మరణిస్తే వారి స్థానంలో మంజూరు చేస్తామని అధికారులు చెప్పేవారు. అప్పట్లో వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత కార్మికులకు రూ.200 చొప్పున, దివ్యాంగులకు రూ.500 చొప్పున పెన్షన్ ఇచ్చే వారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు రూ.వెయ్యి, దివ్యాంగులకు రూ.1500 పెన్షన్ ఇచ్చారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు జీవన భృతి సౌకర్యం కల్పించడంతోపాటు పైలేరియా వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ బాధితులకు పింఛన్ సౌకర్యం కల్పించారు. 2019 సంవత్సరం నుంచి వెయ్యి రూపాయల పింఛన్‌ను రూ.2016కు, రూ.1500 పింఛన్‌ను 3016కు పెంచారు. కనీస వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. 2022 నుంచి డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు కూడా పింఛన్ సౌకర్యం కల్పించారు. జిల్లాలో ప్రస్తుతం 1,69,247 మంది లబ్ధిదారులకు నెలకు రూ.36.13 కోట్లు విలువ చేసే పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు.
దళితబంధు పథకం..
ఎస్సీలు పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ‘దళిత బంధు’ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు 350 యూనిట్లను మంజూరు చేసింది. వీటికి రూ.35 కోట్లు కేటాయించి, లబ్ధిదారుల ఆసక్తి మేరకు వ్యాపార యూనిట్లను మంజూరు చేసింది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం
ఆడపిల్లల పెండ్లి ఖర్చులను భరించేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. 18 ఏండ్లు నిండిన ఆడపిల్ల పెండ్లి ఖర్చుల కోసం రూ.1,00,116 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. జిల్లాలో 39,338 మంది లబ్ధ్దిదారులకు రూ.387 కోట్ల 67 లక్షలు కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందజేశారు. షాదీముబారక్ ద్వారా 5,551 మందికి రూ.53.17 కోట్లు అందజేశారు.
స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక్షేమానికి..
ఆరోగ్యలక్ష్మి ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు రూ.28.2 కోట్లను ఖర్చుచేశారు. జిల్లాలో దివ్యాంగులకు, వివాహ ప్రోత్సాహకాలు, పరికరాలను అందిస్తున్నారు. అర్హులైన 70 మందికి రూ.50 వేల చొప్పున రూ. 35 లక్షల నగదును అందజేశారు.
మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, గీత కార్మికుల కోసం..
మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, వసతి గృహాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తున్నది. మైనారిటీ శాఖ ద్వారా షాదీఖానాలు, మసీదులు, శ్మశానవాటికలు, చర్చీల నిర్మాణానికి మొత్తం 92 పనులను రూ.9.02 కోట్లతో చేపట్టారు. క్రిస్మస్, రంజాన్ పండుగల సందర్భంగా గిఫ్ట్ ప్యాక్‌లను అందజేయడంతోపాటు విందులను ఏర్పాటు చేస్తున్నది. కులవృత్తులను ప్రోత్సహించేందుకు నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు సౌకర్యం కల్పించి.. విద్యుత్ సంస్థకు రూ.1.33 కోట్లు చెల్లించింది. తండాలను జీపీలుగా మార్చడంతోపాటు జిల్లాలో 5 వేల మంది గిరిజనులకు 11వేల ఎకరాలను పోడుభూముల కింద పంపిణీ చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటివరకు 7,442 మంది లబ్ధిదారులకు రూ.99.40 కోట్ల సబ్సిడీతో రుణాలు మంజూరు చేశారు. కార్మికులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం ద్వారా 1414 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో జిల్లాలో 1,48,716 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. గీతకార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షల పరిహారం అందజేయడంతో పాటు మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నది.
డబుల్ బెడ్రూం పథకం..
జిల్లాలో డబుల్ బెడ్రూం పథకం కింద రూ.561.20 కోట్ల వ్యయంతో 10,715 ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా.. 9,372 ఇండ్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో 6,314 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయి. 2,340 ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.331 కోట్లను వెచ్చించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని తాడ్కోల్ శివారులో ఒకేచోట వెయ్యి ఇండ్లను నిర్మించి నిరుపేదలకు అందజేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 11వేల ఇండ్ల నిర్మాణం చేపట్టారు.
నిరుపేదలకు వరం డబుల్ బెడ్రూం ఇల్లు
డబుల్ బెడ్రూం పథకం నిరుపేదలకు వరంగా మారింది. ఇల్లు కట్టడం ఎంతో ఖర్చుతో కూడిన పని. కానీ ప్రభుత్వం ఇండ్లు నిర్మించి, ఉచితంగా అందజేస్తున్నది. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సార్ వెయ్యి ఇండ్లు నిర్మించి, ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు అందించారు. ఇల్లు పొందిన మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం.
-రబ్బానీ, డబుల్బెడ్రూం లబ్ధిదారుడు, బాన్సువాడ
పింఛన్ సే బహుత్ ఫాయిదా హోరా..
సీఎం కేసీఆర్ సాబ్ దేరేసో బేవా పెన్షన్సే ముజ్కో బహుత్ ఫాయిదా హోరా. మేరే షోహర్కా ఇంతెకాల్ హోగయా. మై బహుత్ పరేషాన్ థీ. ఇస్ టైంపే కేసీఆర్ సాబ్ జో 2 హజార్ మహీనా మహీనా దేరేనా, వో పైసో సే ఘర్ చల్రా. మై కేసీఆర్ సాబ్‌కు షుకర్ గుజార్ హూ.
-ఖాజా బీ, వితంతు పెన్షన్ లబ్ధిదారు, కామారెడ్డి
పెన్షన్ పైసలు ఎంతో ఉపయోగపడుతున్నాయి
నేను దివ్యాంగురాలిని. ఏ పని చేయలేని పరిస్థితి ఉండేది. కేసీఆర్ సారు ఇస్తున్న 2 వేల రూపాయలు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తండ్రిలాగా మాకు కేసీఆర్ ఆదుకుంటున్నడు. ఎమ్మెల్యే గంపగోవర్ధన్ సార్ కృషితో నాకు ఫించన్ వస్తున్నది. ఈ పైసలు ఖర్చులకు పోను కొంత డబ్బును దాచుకుంటున్నాను.
– చాకలి యాదమ్మ, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారు, కామారెడ్డి
బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నరు
బీడీలు చుట్టీ చుట్టీ ఎంతో కష్టపడినం. కానీ ఖర్చులకు సరిపడా పైసలు రాకుండే. కేసీఆర్ సారు మా బాధలను అర్థం చేసుకొని బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నడు. ఈ పైసలతో ఇంటి ఖర్చులను వెళ్లదీస్తున్నాం. గతంలో ఏ సర్కారు బీడీ కార్మికుల గురించి పట్టించుకోలేదు. తెలంగాణ సర్కారు మా బాధలను అర్థం చేసుకున్నది. మేం ఎంతో సంతోషంగా ఉన్నాం.
– కాకర్ల నర్సవ్వ, బీడీ కార్మికురాలు, కామారెడ్డి