రామారెడ్డి, జూలై 18: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండాలో గురువారం ఆవుపై దాడి చేసింది చిరుత అని తేలింది. ఇటీవల రామారెడ్డి మండలంలో పెద్దపులి ఓ ఆవు దాడి చేసిన సంగతి తెలిసిందే. పాదముద్రలను బట్టి పెద్దపులిగా నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు దాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం గోకుల్తండాలో మరో ఆవుపై వన్యమృగం దాడి చేసి చంపేసింది.
అది పుద్ద పులేనని ప్రచారం జరుగడంతో అటవీ అధికారులు ఆవు కళేబరం వద్ద ట్రాప్ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ ఆవు కళేబరం తినేందుకు వచ్చిన చిరుత కెమెరాకు చిక్కింది. దీంతో గోకుల్తండాలో ఆవుపై దాడి చేసింది చిరుతేనని గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాటింపు వేయించారు.
రెడ్డిపేట్ స్కూల్తండాలోని అటవీప్రాంతంలో ఇటీవల ఓ ఆవుపై దాడిచేసిన పెద్దపులి కోసం అటవీశాఖాధికారులు గాలింపు చర్యలు ముమ్మరంచేశారు. ఆవుపై పులి దాడిచేసిన ప్రాంతాన్ని స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏలుసింగ్ శుక్రవారం పరిశీలించారు. అధునాతన పద్ధతులతో త్వరగా పులిజాడ కనిపెట్టాలని అటవీశాఖాధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా ఫారెస్టు అధికారిణి నిఖిత, అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి, ఎఫ్డీవో రామకృష్ణ ఉన్నారు.