మోర్తాడ్, మార్చి 6: మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం కమ్మర్పల్లి రేంజ్ పరిధి, నిజామాబాద్ జిల్లా సరిహద్దును దాటి సిరిసిల్ల జిల్లా మల్యాల రేంజ్ అటవీ ప్రాంతంలోకి పెద్దపుల్లి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా పొతంగల్ ప్రాంతం నుంచి కమ్మర్పల్లి మండలం గట్టుపొడచిన వాగు ప్రాంతంలోకి చేరుకున్నది. ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు దాని పాద ముద్రల ఆధారంగా అధికారులు గుర్తించి, మూడు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అయితే గట్టు పొడచిన వాగు ప్రాంతంలో నీరు ఉండడం, తినడానికి ఆహారం దొరక్కపోవడంతో ఇక్కడే రెండురోజులుగా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అటవీఅధికారి ఒకరు పులిని చూసినట్లు కూడా ధ్రువీకరించారు. శుక్రవారం కమ్మర్పల్లి అటవీరేంజ్ అధికారి బానోత్ రవీందర్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా విడిపోయి ఇనాయత్నగర్, కోనాపూర్, మానాల, భీంనగర్ అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పులి పాదముద్రల ఆధారంగా మానాల అటవీప్రాంతం గుండా మల్యాల రేంజ్ అటవీప్రాంతంలోకి పులి వెళ్లినట్లుగా అధికారులు అంచనా వేశారు. దాదాపు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోకి వెళ్లిపోయినట్లు అంచనా వేస్తున్నామని, అంతకన్నా ఎక్కువ దూరం కూడా వెళ్లి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
పెద్దపులి ఎలా వచ్చిందో వాసన చూసుకుంటూ అదే దారిలో తిరిగి వెళ్లిపోతుందని, ఆహారం, నీరు దొరికినప్పుడు షెల్టర్ తీసుకునే అవకాశం ఉంటుందని కమ్మర్పల్లి రేంజ్ అటవీశాఖ అధికారి బానోత్ రవీందర్ అన్నారు. బుధవారం పెద్దపులి పాదముద్రలను పరిశీలించామని, గట్టుపొడచిన వాగు ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. శుక్రవారం చేపట్టిన గాలింపు ద్వారా పులి అడుగులను బట్టి కమ్మర్పల్లి అటవీరేంజ్ ను వదిలి వెళ్లినట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ కోనాపూర్, ఇనాయత్నగర్, దొమ్మర్సౌడ్తండా, నర్సాపూర్, మానాల, భీంనగర్ గ్రామాల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.