వినాయక్‌నగర్, నవంబర్ 25 : తమ స్థలం పక్కన ఉన్న మడిగెను విక్రయించనందుకు ఓ న్యాయవాదిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై యాసిన్ అరాఫత్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ఖిల్లారోడ్డులో న్యాయవాది ఖాసీంకు ఒక మడిగె (షట్టర్ రూం) ఉన్నది.
మడిగె పక్కనే హర్షాద్ఖాన్ స్థలం ఉన్నది. తమ స్థలం పక్కన ఉన్న మడిగెను తమకు విక్రయించాలని హర్షాద్ఖాన్తోపాటు అతడి కుమారులు అడుగుతూ ఒత్తిడి చేశాడు. ఆదివారం రాత్రి ఖాసీం కార్యాలయంలో ఈ విషయమై మాట్లాడారు. తన కార్యాలయాన్ని ఇందులోనే నడుపుతున్నానని, విక్రయించే ఉద్దేశం లేదని ఖాసిం చెప్పడంతో ఆగ్రహించిన హర్షాద్ఖాన్తో పాటు అతడి కుమారులు ముజాహిద్ ఖాన్, ముజాఫర్ ఖాన్ దాడి చేయగా గాయాలయ్యాయి. ఖాసీం కుమారుడు ఖాలీద్ ఫిర్యాదు మేరకు హర్షాద్ఖాన్తోపాటు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
సీనియర్ న్యాయవాదిపై దాడికి పాల్పడిన విషయం తెలుసుకున్న వెంటనే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో న్యాయవాదులతో సోమవారం సమావేశం నిర్వహించారు. విధులు బహిష్కరించి, బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా ఖిల్లారోడ్డులోని ఖాసిం ఆఫీస్ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. అనంతరం ఏసీపీ రాజావెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్‌రెడ్డితోపాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.