Nizamabad | వినాయక్ నగర్, అక్టోబర్, 9 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం నుండి ముగ్గురు విద్యార్థినిలు వెళ్లిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. నగరంలోని కోట గల్లి ఎస్సీ హాస్టల్లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన రెండో టౌన్ ఎస్ఐ ముజాహిద్ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రాంగణంలో గల ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో ఉండే ముగ్గురు విద్యార్థినిలు ఈరోజు తెల్లవారుజాము ఎవరికి చెప్పకుండా హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయినట్లు హాస్టల్ సిబ్బంది గుర్తించినట్లు తెలిపారు.
విద్యార్థుల కోసం చుట్టుపక్కల వెతికినప్పటికీ ఇలాంటి ఆచూకీ లభించకపోవడంతో సదరు హాస్టల్ వార్డెన్ నాగలక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లుగా ఎస్సై తెలిపారు. తెల్లవారుజాము నుండి హాస్టల్ పరిసర ప్రాంతాలతో పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇతర ప్రధాన కూడలలో కల సీసీ కెమెరాల ఫుటేజ్ లను పోలీస్ బృందాలు పరిశీలిస్తున్నారు. హాస్టల్ నుండి విద్యార్థినిలు అదృశ్యమైన విషయం వాళ్ల తల్లిదండ్రులకు తెలియడంతో వాళ్లు ఆందోళనకు గురై హుటా హుటిన హాస్టల్కు వచ్చినట్లు తెలిసింది. హాస్టల్ నుండి వెళ్లిపోయిన ముగ్గురు విద్యార్థినిలు హాస్టల్లో ఉండడం ఇష్టం లేక వెళ్లిపోయారా, లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేపట్టారు.