వినాయక నగర్,ఏప్రిల్ 18 : నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఓ ఇంట్లో రాత్రి దొంగలు పడి దోచుకెళ్లారు. నగర శివారులోని సారంగాపూర్ పరిధిలో గల అక్బర్ బాగ్ ఏరియాలో గురువారం రాత్రి ఓ ఇంటి తాళాన్ని పగులగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి అందులో గల 13 తులాల బంగారు నగలు, 40 తులాల వెండిని దోచుకు వెళ్లారు.
ఇంటి యజమాని షేక్ ముజీబ్ ఉల్ రెహ్మాన్ శుక్రవారం తన ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించి క్లీస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.