ఊట్కూర్ : నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల్లో సాగునీటి ( Irrigation Water ) ఎద్దడి తీవ్రతరం అవుతోంది. ఎగువ ప్రాంతం నారాయణపూర్ డ్యామ్( Narayanapur Dam ) నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో కృష్ణానది పరివాహక ప్రాంతం ఆయకట్టుకు సాగునీరు అందించే ముడుమాల్ ఎత్తిపోతల పంపు ( Mudumal lift irrigation ) హౌస్ మూతపడింది. వారం రోజులుగా వరి పొలాలకు సాగునీరు అందక పోవడంతో నదీ పరీవాహక గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముడుమాల్ లిఫ్ట్ ఏ, లిఫ్ట్ బీ పంహౌస్ గ్రామాలు కోల్పూర్, మంది పల్లి, గజరాం దొడ్డి, పుంజ నూర్ రైతులు ఎత్తిపోతల పంపు హౌస్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి సాగు నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎత్తిపోతల కింద యాసంగిలో దాదాపు 5వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందవలసి ఉంది. ప్రస్తుతం వరి పంటలు పొట్ట, పాలు పోసుకునే దశలో ఉన్నాయి.పంటను కాపాడలంటే సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.