శక్కర్‌నగర్, నవంబర్ 8: బోధన్ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి రూ.ఐదు లక్షల చోరీ జరిగి నేటితో మూడు నెలలు పూర్తి అవుతున్నది. అయినా ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు.. సెప్టెంబర్ 8న బ్యాంకులోని క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు చోరీ అయ్యాయి. కాగా.. చోరీ జరిగిన ఘటనపై సంబంధిత బ్యాంకు అధికారులు 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. మూడు రోజుల కాలాయాపన ఎందుకు జరిగిందనే విషయం పలు అనుమానాలకు తావిస్తున్నది. పలు రకాల ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకుకు వచ్చే ఖాతాదారులను పదుల సంఖ్యలో ప్రశ్నలు వేసే సెక్యూరిటీ గార్డుతోపాటు సిబ్బంది చోరీ ఘటనను గుర్తించకపోవడం శోచనీయం.
కేవలం బ్యాంకు వారి నిర్లక్ష్యంతోనే డబ్బులు చోరీ అయ్యాయని పలువురు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. నిత్యం సందడితో ఉండే రోడ్డు.. రహదారి పక్కనే బ్యాంకు ఉండగా.. డబ్బులు ఎలా చోరీ అయ్యాయనే విషయం అంతుచిక్కడం లేదు. ఘటన జరిగిన మూడు రోజుల అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు బ్యాంకులోని సీసీ ఫుటేజీల ఆధారంగా చోరీ ఘటనలో ముగ్గు రు వ్యక్తులు పాల్పడినట్లు నిర్ధారించారు. వీరిలో ఒక బాలు డు కూడా ఉన్నాడని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తున్నది. ఈ చోరీ ఘటనలో బ్యాంకు ఉద్యోగుల నిర్లక్ష్యం ఉన్నదని తెలిసినా.. ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో అలసత్వం వహించడంలో ఆంతర్యం ఏమిటని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు.
నిందితులను త్వరలో పట్టుకుంటాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బోధన్ బ్రాంచ్‌లో రూ. ఐదులక్షల చోరీ ఘటనలో నిందితులను గుర్తించాం. వారిని త్వరలోనే పట్టుకుంటాం. ఫిర్యాదులో జాప్యం కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ వారిని అదుపులోకి తీసుకుంటాం. చోరీకి పాల్పడిన వ్యక్తులు ఇతర రాష్ర్టాలకు చెందిన వారు.
-పట్టణ సీఐ వెంకట నారాయణ