నిజామాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఆయా సెంటర్లలో సిబ్బంది లేక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కొంత మంది రిటైర్డ్ కావడం, మరికొందరు పని మానుకోవడంతో ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. రేవంత్ సర్కారు మాత్రం ఖాళీల భర్తీపై నోరు మెదపడం లేదు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల్లో సిబ్బంది కొరతను తీరుస్తామంటూ సంబంధిత మంత్రి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. సిబ్బంది కొరత కారణంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందాల్సిన పోషకాహారం అందకుండా పోతున్నది.
నిజామాబాద్ జిల్లాలో ఐదు ప్రాజెక్టుల పరిధిలో 1394 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్, డిచ్పల్లి, భీమ్గల్, ఆర్మూర్, బోధన్ ప్రాజెక్టుల పరిధిలో కలిపి 96 టీచర్ పోస్టులు, 303 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో టీచర్లు, ఆయాలు లేక గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెంటర్లలో సిబ్బంది కొరత ఏర్పడిన తర్వాత ఇన్చార్జీలను పెట్టి కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, సరైన రీతిలో పనితీరు నడవడం లేదన్న విమర్శలున్నాయి.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం మూలంగా అంగన్వాడీల్లో పరిపాలన గాడి తప్పింది. జిల్లా అధికారులంతా ఇతరత్రా పనుల్లో బిజీగా ఉండటంతో సెంటర్లపై పర్యవేక్షణ లేకుండా పోయింది. నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో కొందరి ఇష్టారాజ్యం నడుస్తున్నది. జిల్లా సంక్షేమాధికారి, సీడీపీవోల పట్టింపులేని తనం కూడా ఈ పరిస్థితికి కారణం. మాతా శిశు సంరక్షణలో భాగంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలను చేపట్టింది.
పేద కుటుంబాల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసింది. కేంద్ర ప్రభు త్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతున్నప్పటికీ సొంతంగా నిధులు వెచ్చించి కేసీఆర్ మాత్రం ఆడబిడ్డల బాగు కోసం కృషి చేశారు. పుట్టబోయే చంటిపిల్లల ఆరోగ్యంతో పాటుగా గర్భిణులు, బాలింతలను కాపాడుకునేందుకు అంగన్వాడీల్లో పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించారు. అంగన్వాడీల ద్వారా అందే బలవర్ధకమైన ఆహారాన్ని అర్హులైన వారంతా తీసుకునేలా గతంలో చర్యలు తీసుకోగా ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరగడం లేదు. ఎన్రోల్మెంట్ విషయంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తున్నది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భర్తీ ప్రక్రియ ఉంటుంది. ఖాళీల వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం.
– రసూల్ బీ, నిజామాబాద్ జిల్లా సంక్షేమ అధికారిణి