Theft | వినాయక నగర్, జూన్ 15 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగర నడిబొడ్డున ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఏజెన్సీలో చోరీకి పాల్పడ్డారు. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి కథనం ప్రకారం.. నగరంలోని తిలక్ గార్డెన్ చౌరస్తా, పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయానికి కూత వేటు దూరంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ లో ఆదివారం అర్ధరాత్రి అనంతరం చోరీ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఏజెన్సీ షెటర్ తాళాలు ధ్వంసం చేసి లోనికి వెళ్లి కౌంటర్ లో ఉన్న నగదును దొంగిలించుకుపోయారు.
సోమవారం ఉదయం ఏజెన్సీ తెరిచేందుకు వచ్చిన సిబ్బంది షట్టర్ తాళాలు ధ్వంసం చేసి ఉండడంతో దాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లి చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. నగదు దొంగతనం పై గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ షేక్ నయీమ్ ఫిర్యాదులో రూ.57 వేల నగదు చోరీ జరిగినట్లు ఎస్హెచ్వో వెల్లడించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్హెచ్ఓ వెల్లడించారు. చోరీ జరిగిన ప్రాంతంలోని చుట్టుపక్కల షాపుల వద్ద ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి పేర్కొన్నారు.