దస్తురాబాద్, ఆగస్టు 4 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని ఆకొండపేటలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పరిపాలన సౌలభ్యం కోసం ఉద్దేశంతో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన ఆకొండపేట గ్రామ పంచాయతీకి పంచాయతీ శాఖ ద్వారా రూ20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంజురు చేసి, నిధులు విడుదల చేసింది. నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించి దాదాపు సంవత్సరం గడుస్తున్నా.. ప్రారంభోత్సవాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు చేయడం లేదు.
ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ భవనం వినియోగంలోకి రాకపోవడంతో ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తయి దాదాపు సంతవ్సరం గడిచినా ప్రారంభోత్సం జరగకపోవడంతో అది నిరుపయోగంగా నిలిచిపోయింది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం ఖాళీగా ఉండడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ కార్యకలాపాలు తాత్కాలికంగా కొనసాగుతుందని వారు చెబుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని త్వరగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీంతో గ్రామ పంచాయతీ సేవలు మరింత సమర్థవంతంగా అందడంతోపాటు ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.