UPI services : యూపీఐ లావాదేవీల (UPI Transactions) పై ప్రతిపాదించిన ఎండీఆర్ ఛార్జీ (MDR charges) కి వ్యతిరేకంగా అక్టోబర్ 2న చేపట్టతలపెట్టిన ‘నో యూపీఐ డే (NO UPI Day)’ రద్దయ్యింది. వ్యాపార సంఘాలు తమ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తో బుధవారం జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మంది వ్యాపార ప్రతినిధులు నిర్మలా సీతారామన్‌ను కలిశారు.
రూ.2,000 కు మించిన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఫీజు విధించే ప్రతిపాదనపై వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఛార్జీతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై భారం పెరుగుతుందని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల వినియోగం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. చాందినీ చౌక్ ఎంపీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ నేతృత్వంలో ఈ ప్రతినిధి బృందం సమావేశమైంది.
ప్రతిపాదిత ఛార్జీపై స్పష్టత ఇవ్వాలని ఆ ప్రతినిధి బృందం కోరింది. వ్యాపారుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సమావేశం తర్వాత ఖండేల్వాల్ మాట్లాడుతూ.. కేంద్రంతో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. వ్యాపారులు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్న భరోసా లభించిందన్నారు. దాంతో అక్టోబర్ 2న తలపెట్టిన నిరసనను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.