రంగారెడ్డి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అనుమతులు లేకుండా సుమారు యాభైకి పైగా జూనియర్ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఈ కళాశాలల్లో నీట్, జేఈఈ, ఐఐటీల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మబలికి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ కళాశాలల నిర్వహణకు ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు చేస్తున్న కళాశాల యాజమాన్యాలపై నెల రోజులు గడుస్తున్నా ఇంటర్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న హయత్‌నగర్, సరూర్‌నగర్, పెద్దఅంబర్‌పేట్, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు, రాజేంద్రనగర్, శంషాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల వంటి ప్రాంతాల్లో అనుమతి లేకుండా పలు కళాశాలలు కొనసాగుతున్నాయి. ఈ కళాశాలలు కనీస నిబంధనలు కూడా పాటించడం లేదనే ఆరోపణలున్నాయి.
కళాశాలలకు అనుమతులు లేకపోవడంతో యాజమాన్యాలు చివరి నిమిషంలో అనుమతులున్న కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై అక్కడి నుంచి పరీక్షలు రాయిస్తున్నారు. దీంతో చివరి నిమిషంలో టీసీ, మెమోలివ్వడంలో యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నారు. సకాలంలో సర్టిఫికెట్లు రాక విద్యార్థులు పై చదువులకు వెళ్లడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. అడిగిన ఫీజులిచ్చినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధిస్తున్నాయని వాపోయారు. విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జూనియర్ కళాశాలల్లో ఈ తతంగం నడుస్తున్న విషయం ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఈ విషయమై పలు విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్లారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కళాశాలల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.