హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియాలోని బోండీ ప్రాంతంలో జరిగిన విషాద ఘటన సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి దాదాపు 20 మందిని కాపాడిన హైదరాబాద్కు చెందిన రహ్మత్ పాషాను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణాలకు తెగించి తోటివారిని రక్షించిన రహ్మత్పాషా ధైర్యసాహసాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. హైదరాబాద్లో మంగళవారం రహ్మత్పాషాను శాలువాతో ఘనంగా సన్మానించారు. బోండీ బీచ్ సమీపంలో ఒక ప్రయాణికుడిని దింపిన అనంతరం పెద్ద శబ్దాలు వినిపించడంతో తొలుత పటాకులుగా భావించిన రహ్మత్ పాషా..
వాహనం దిగి చూడగా దుండగుడు కాల్పులకు తెగబడుతుండటాన్ని గమనించాడు. ఆ సమయంలో వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా, గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ అనేక మందిని కాపాడేందుకు పాషా కృషిచేశాడు. పాషా చూపిన అసాధారణ ధైర్యాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు శాశ్వత నివాస హోదా కల్పించడం ప్రతి భారతీయుడికీ, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణమని కేటీఆర్ కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, శ్రీధర్ బొర్రా, వేణు పాల్గొన్నారు.