మోర్తాడ్, మార్చి 19: మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి నెలరోజులుగా సంచరించడం ఇక్కడి ప్రాంతాల ప్రజల్లో కలకలం రేపింది. ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటి వరకు పెద్దపులి జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్లా జిల్లాల సరిహద్దులో సంచరిస్తుండడంతో ఇక్కడి ప్రజలు ఎప్పుడు అది ఎటువైపు వస్తుందో తెలియక భయం భయంగా గడుపుతున్నారు. యాదాద్రి వరకు వెళ్లిన పెద్దపులి మహారాష్ట్రకు తిరుగుపయనమయ్యిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతంలోకి చేరుకున్నదని అధికారులు చెప్తున్నమాట.
అయితే మేటింగ్ కోసం బయల్దేరిన పులి మహారాష్ట్ర నుంచి యాదగిరిగుట్ట.. అక్కడి నుంచి తిరుగుపయనంలో ఇప్పటి వరకు దాదాపు 20 పశువులను హతమార్చినట్లు తెలుస్తున్నది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం భీంనగర్ గ్రామానికి చెందిన ఆవు, ఎద్దును హతమార్చింది. మేటింగ్ కోసం బయల్దేరిన పెద్దపులి జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామ అడువుల నుంచి నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని కమ్మర్పల్లి అటవీ రేంజ్ పరిధిలోని గట్టుపొడచిన వాగు ప్రాంతానికి చేరింది. పులి ఇక్కడ ఉన్నట్లు పాదముద్రలను గుర్తించిన అధికారులు ట్రాకింగ్ చేసేందుకు కెమెరాలను కూడా అమర్చారు.
ఇక్కడి ట్రాప్ కెమెరాలకు పులి చిక్కినట్లు అధికారులు గుర్తించారు. కెమెరాకు చిక్కిన పులి ఫొటో బయటికి రావడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. అటవీ అధికారులకు సంబంధించిన ఫొటోలు ఎవరు లీక్ చేస్తున్నారని విచారణ సైతం చేసినట్లు ప్రచారం ఉన్నది. ఈనేపథ్యంలో కమ్మర్పల్లి రేంజ్లో తిరుగుతున్న పెద్దపులి సమాచారాన్ని అధికారులు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. సమాచారం ఇస్తే ఎవరేమంటారో అన్న భయంతో వెనుకడుగువేశారు. ఇటువంటి పరిస్థితుల్లో గట్టుపొడచిన వాగు నుంచి రెండుమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిసిల్లా జిల్లా మానాల అడువుల్లోకి పులి వెళ్లిందని అధికారులు ప్రకటించారు. మరుసటి రోజు తిరిగి కమ్మర్పల్లి రేంజ్‌లోని భీంనగర్ ప్రాంతంలోకి పులి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
అక్కడి నుంచి తిరిగి సిరికొండ రేంజ్‌లోకి వెళ్లిందని అనుకున్నారు. కానీ భీంనగర్‌లోని ఆవు, ఎద్దును చంపడం కలకలం రేపింది. దీంతో అధికారులు మహారాష్ట్రలోని పుణే నుంచి రెస్క్యూటీంను రంగంలోకి దించారు. రెస్క్యూటీం జిల్లాలోని వివిధ రేంజ్ పరిధిలో అటవీ అధికారులు, సిరిసిల్లా జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. రెస్క్యూటీం రంగంలోకి దిగిన అనంతరం పెద్దపులి కమ్మర్పల్లి రేంజ్ ప్రాంతాన్ని దాటి వెళ్లిందా లేదా అన్న విషయం తెలియలేదు. మరోవైపు సోషల్‌మీడియాలో కమ్మర్పల్లి మండలం కోనాపూర్ అటవీప్రాంతంలో పులి తిరుగుతుందన్న వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం ఇక్కడి ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పులి ఇక్కడిక్కడే తిరుగుతుండడం, మళ్లీ సరిహద్దు ప్రాంతంలోకి వస్తుందేమోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా అడవుల్లోకి వెళ్లింది
జిల్లా సరిహద్దు నుంచి జగిత్యాల జిల్లా అడవుల్లోకి పులి వెళ్లింది. పెద్దపులి వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తిరుగుతున్న సమయంలో ఆహారం, నీరు దొరికే ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నందున, తిరిగి మన జిల్లా సరిహద్దులోకి కూడా రావచ్చు. కావున పులి తన ప్రాంతానికి చేకుకునేంత వరకు సరిహద్దు అటవీప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
-రవీందర్, కమ్మర్పల్లి ఎఫ్ఆర్వో