కోల్‌కతా: ఆర్జీ కర్ హత్యాచార బాధితురాలి మృతదేహాన్ని అత్యవసరంగా దహనం చేసిన వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఒడిశాలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. (RG Kar Case) సాక్ష్యాలను ధ్వంసం చేయడం, నేరపూరిత కుట్ర, ఒక వ్యక్తిని వారి ఇష్టానికి వ్యతిరేకంగా పని చేసేలా బలవంతం చేయడం వంటి ఆరోపణలపై పానిహతి మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైనట్లు వెల్లడించారు.
కాగా, 2024 ఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ అనుమానాస్పదంగా మరణించింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు వచ్చిన ఆరోపణల కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ప్రధాన నిందితుడికి ట్రయిల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
అయితే ఈ సంఘటన జరిగిన రెండేళ్ల తర్వాత బాధితురాలి తండ్రి తాజాగా సోమవారం ఖర్దాహా పోలీస్ స్టేషన్లో కొత్తగా ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మృతదేహాన్ని ‘హడావిడిగా దహనం’ చేయడంలో బలవంతం చేసిన ముగ్గురిలో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. దీంతో పోలీసులు కొత్తగా కేసు నమోదు చేశారు.
అలాగే జూనియర్ డాక్టర్ మరణించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దహన సంస్కారాల రుసుము మాఫీ, సంబంధిత పత్రాలపై బాధితురాలి కుటుంబ సభ్యుల సంతకాలు లేకపోవడం వంటి ఆరోపణలతో సహా కొన్ని అంశాలపై అనుమానాలు ఉన్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ దహన సంస్కారాలకు సంబంధించిన పరిస్థితులపై ప్రత్యేక కేసు నమోదు చేయాలని పోలీసులను సీఎం సువేందు ఆదేశించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే టీఎంసీ మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌ను అరెస్ట్ చేశారు. అయితే సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుతో దీనికి సంబంధం లేదని, ఇది కొత్తగా నమోదైన కేసు అని పోలీస్ అధికారి తెలిపారు.