– స్థానికుల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకోవాలి
– స్థల పరిశీలనలో బీఆర్ఎస్, సిపిఎం నేతలు
ఖమ్మం రూరల్, ఆగస్టు 13 : విద్యార్థులు, యువత భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం కూల్చివేయడం ఆక్షేపనీయమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు నందిగామ కృష్ణ, ఎటుకూరి ప్రసాద్, స్థానిక ప్రజలతో కలిసి గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ఇందిరమ్మ కాలనీలో పర్యటించారు. ఇటీవల అధికారులు కూల్చి వేసిన క్రీడా మైదానంను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తొలుత స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో ఈ క్రీడా ప్రాంగణంలోని ఆటలాడుకోవడం జరుగుతుందన్నారు. పిల్లలకు ఉపయోగపడే క్రీడా ప్రాంగణాన్ని తిరిగి ఉపయోగాల్లోకి తీసుకురావాలని వారి కోరారు.
బెల్లం వేణుగోపాల్ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్‌ను, యువకులలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకుగాను ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కూల్చివేయడం సమంజసం కాదన్నారు. దీంతో ప్రభుత్వ నిధులు వృథా కావడంతో పాటు స్థానికులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. స్థానికుల ఆలోచన మేరకు తిరిగి క్రీడా ప్రాంగణం పునఃనిర్మాణం చేయాలని, లేదా ఇప్పటికే శంకుస్థాపన చేసినటువంటి పార్కు ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలైన కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలోనే అఖిలపక్ష నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ఇందిరమ్మ కాలనీ యువకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.