నిజామాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులందరికీ రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలోని రైతులు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులను నిలదీస్తున్నారు. దీనిపై రైతులకు సమాధానం చెప్పలేక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల రెంజల్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యటించగా..రైతులు చుట్టుముట్టి రుణమాఫీపై ప్రశ్నించారు.
ప్రజావాణి కార్యక్రమంలోనూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు రైతుల నుంచి నిరసన సెగలు తప్పడంలేదు. సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ హోదాలో ఇచ్చిన హామీకే దిక్కులేకుండా పోయిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నిలకు ముందు ఓ మాట.. అధికారం వచ్చాక మరో మాట మార్చడంపై మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రైతురుణమాఫీ ప్రక్రియ ఒక అడుగు ముందుకు, పదడుగులు వెనక్కిలా మారింది. గతేడాది ఆగస్టు 15న మొదలైన ఈ ప్రక్రియ నాలుగు విడుతలుగా అమలై ఆగిపోయింది.
సగాని కన్నా తక్కువ మందికి మాత్రమే రుణమాఫీ వర్తించడంతో మిగతావారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. మా పరిస్థితి ఏమిటి? అంటూ రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తుండడం గమనార్హం. రుణమాఫీ కోసం చెప్పులరిగేలా రైతులు తిరుగుతున్నప్పటికీ పాలకుల్లో శ్రద్ధ కనిపించడం లేదు. రుణమాఫీ పేరు ఎత్తాలంటేనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వణికి పోతున్నారు. తమ ప్రసంగాల్లో మొన్నటి వరకూ రుణమాఫీ చేశామంటూ చెప్పుకొచ్చిన వారంతా ఇప్పుడు రుణమాఫీ పేరు ఎత్తాలంటే వెనుకడుగు వేస్తున్నారు.
బ్యాంకర్ల నుంచి వేధింపులు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల పంట రుణాలను రద్దు చేస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అనేక బహిరంగసభలు, ఎన్నికల ప్రచారంలోనూ స్పష్టం చేశారు. 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. వంద రోజుల్లోనే పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన నేతలే రైతులను దగా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వెంటాడి రుణమాఫీ కోసం ఉద్యమించడంతో చేసేది లేక 2024, ఆగస్టు 15న రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం
తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీకారం చుట్టింది. అరకొరగా పంట రుణాలను మాఫీ చేసింది. ఆ తర్వాత రైతులంతా రోడ్డు ఎక్కి కాంగ్రెస్ నేతలను నిలదీయడంతో రెండు, మూడు విడుతల్లోనూ రుణమాఫీ జరిగింది. తీరా రుణమాఫీ రాని వారంతా ఆందోళన చేయడంతో చివరిగా నాలుగో విడుతను సైతం విడుదల చేసింది. అయినప్పటికీ సగం మందికిపైగా రైతులు ఇప్పటికీ మాఫీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మొత్తం పంట రుణాలను చెల్లించలేక, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు బ్యాంకు అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
Nizamabad
ఎక్కడికక్కడ నిలదీతలు
రెంజల్ మండలంలో కలెక్టర్‌ను రైతులు చుట్టుముట్టి రుణమాఫీ వర్తింపజేయాలంటూ ప్రశ్నలు సంధించారు. అచ్చంగా ఇలాంటి పరిస్థితే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ కనిపిస్తున్నది. ప్రభుత్వతీరుపై రైతుల్లో నివురు గప్పిన నిప్పులా అసంతృప్తి పేరుకు పోయింది. కాంగ్రెస్ నేతలెవరైనా ఎదురు పడితే చాలు రుణమాఫీపై నిలదీస్తుండడంతో సరైన సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్లు చేసి వివరాలు కనుక్కునే ప్రయత్నాలు చేస్తుండగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని సమాధానం వస్తుండడడంతో రైతులను నచ్చజెప్పలేక చతికిల పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 1.77లక్షల మందికి మొండి‘చేయి’
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2లక్షల 3వేల 520 మంది రైతులున్నారు. వీరిలో లక్షా 555 మందికి రూ.781కోట్లు పంట రుణాలు రద్దు చేశారు. ఇంకా లక్షా 2వేల 265 మందికి రుణమాఫీ కాలేదు. కామారెడ్డి జిల్లాలో లక్షా 76వేల మంది రైతులు రుణాలు తీసుకోగా ఇందులో లక్షా ఒక వేయి 417 మందికి రూ.736కోట్లు రుణమాఫీ వర్తించింది. 75వేల మందికి మొండిచేయి చూపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1.77లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉన్నది. రుణమాఫీ జాబితాను రూపొందించడంలో బ్యాంకర్లు, సహకార శాఖ, వ్యవసాయ శాఖ అధికారుల తప్పిదాలు.. రైతులకు శాపంగా మారాయి.
కొద్ది మంది రైతులను ప్రభుత్వ ఉద్యోగులుగా చిత్రీకరించి అనర్హులుగా మార్చారు. మరికొంత మందికి రైతుల ఆధార్ కార్డు నంబర్లను తప్పుగా నమోదు చేశారు. పట్టాదారు పాసుపుస్తకాల వివరాల్లోనూ తప్పులను వ్యవసాయ శాఖ పేర్కొంది. రైతులు తీసుకున్న రుణాలను నమోదు చేయడంలో సహకార సంఘాల్లోని ఉద్యోగులు పొరపాట్లు చేయడం కూడా రుణమాఫీ రాకపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. వివరాలు సవ్యంగా ఉన్నప్పటికీ, సర్కారు కొర్రీలు విధించిన నిబంధనల మేరకు అర్హతలు కలిగిన రైతులకు సైతం ఇంత వరకూ రుణమాఫీ జాబితాలో పేరు నమోదుచేయలేదు. దీంతో వీరంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.