మోర్తాడ్, మార్చి 14: మూడు జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్ద పులి అటవీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఈ వన్యమృగం కోసం అటవీ శాఖ అన్వేషణ కొనసాగుతున్నది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో తిరుగుతున్న పెద్దపులి సంరక్షణ ఇప్పుడు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని పుణేకు చెందిన రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం కమ్మర్పల్లి అటవీ రేంజ్లో మకాం వేసి, పెద్దపులి రెస్క్యూ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.
రెస్క్యూ బృందం..
15 రోజులుగా మెట్పల్లి, కమ్మర్పల్లి, సిరికొండ, మల్యాల రేంజ్ అధికారులు పులిజాడ కోసం గాలిస్తూనే ఉన్నారు. అధికారులు గుంపులుగుంపులుగా గాలింపునకు వెళ్లడంతో పెద్దపులి వివిధ దిశల్లో ప్రయాణం సాగించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పెద్దపులి సంరక్షణ కోసం పుణే నుంచి వచ్చిన రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. కమ్మర్‌పల్లిలో శనివారం మూడు రేంజ్‌ల పరిధిలోని అటవీ అధికారులతో బృంద సభ్యులు సమావేశమయ్యారు. పులిని ఎలా ప్రశాంతపరచాలి, ట్రాప్ కెమెరాలను ఎలా అమర్చాలి, పశువులను చంపినపుడు తీసుకోవలసిన తక్షణ జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో మన అటవీ అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పులి మేట్ కోసం ఎలా వెతుక్కుంటూ వచ్చిందో, అదే విధంగా తిరిగి వెళ్తుందని అధికారులు చెప్తున్నప్పటికీ, 15 రోజుల పాటు జిల్లా సరిహద్దులోనే తిరగడంపైనా కూడా సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపులిని సురక్షితంగా జిల్లా సరిహద్దు నుంచి.. వచ్చిన ప్రదేశానికి పంపించేందుకే పుణే నుంచి రెస్క్యూ టీంను పిలిపించి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తోడు కోసం..
మహారాష్ట్ర నుంచి మూడు నెలల క్రితం తోడు కోసం బయల్దేరిన పెద్దపులి తెలంగాణకు చేరుకుంది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సంచరించిస్తూ, చివరకు మళ్లీ నిజామాబాద్ జిల్లా సరిహద్దులోకి వ చ్చి చేరింది. గత 15 రోజులుగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా సరిహద్దులో సంచరించింది. మార్చి 2న జగిత్యాల జిల్లా నుంచి కమ్మర్పల్లి అటవీరేంజ్లోకి అడుగుపెట్టిన పెద్దపులి.. మల్యాల రేంజ్ పరిధిలోని మానాల అడవుల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి మళ్లీ కమ్మర్పల్లి రేంజ్‌లోని భీంనగర్, కారేపల్లి ప్రాంతంలోకి వచ్చింది. భీంనగర్ శివారులో రెండు ఆవులను చంపింది. ఈ ఘటన అటవీశాఖ అధికారుల్లో కలకలం రేపింది. దీంతో అటవీశాఖ జిల్లా అధికారులు కమ్మర్పల్లి రేంజ్ కార్యాలయానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.