శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శక్కర్నగర్లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీలో ( Nizam Sugar Factory) నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట బుధవారం కార్మిక సంఘాల నాయకులు ఆందోళన ( Dharna ) చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఉపేందర్, నాగుల రవిశంకర్ గౌడ్, సత్యనారాయణ, బాలకృష్ణ లు మాట్లాడుతూ ఫ్యాక్టరీని అకారణంగా మూసివేయడం వల్ల కార్మికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తామని చెప్పడంతో కార్మికుల్లో ఆశలు చిగురించాయని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కాలయాపన కమిటీనిగానే మారిందని విమర్శించారు.
ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయి వేతనాలు అందక పలువురు అనారోగ్యాన్ని గురై మృతి చెందారని అన్నారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకొని వెళ్లేందుకు రెండు మార్లు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని కలిసేందుకు వెళ్లిన లాభం లేకుండా పోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల బకాయి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రాంబాబు, భాస్కర్ తదితరులు ఉన్నారు.