నిజామాబాద్, ఆగస్టు 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇందులో భారీగా ఓట్లు తీసి వేశారు. చనిపోయిన, వలస వెళ్లిన, డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను ఏరి వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2లక్షల 95వేల 938 ఓట్లు తొలగించారు. కచ్చితమైన ఓటర్లతో జాబితా రూపకల్పన చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను భారత ఎన్నికల సంఘం చేపట్టింది. క్షేత్ర స్థాయిలో కొంత మంది బీఎల్వోల పనీతీరుతో అనుకున్నది అమలు కావడం లేదన్న ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఓటరుగా కొనసాగించేందుకు 2002 సమగ్ర ఓటర్ జాబితాను ప్రాతిపదికన తీసుకుంటున్నారు. తద్వార మ్యాపింగ్ చేసి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి వివరాలు నమోదు అనంతరం స్వీకరించారు.
అందులో పేర్కొన్న సమాచారం ఆధారంగా ఓటు హక్కు కల్పిస్తున్నారు. జూన్ 10, 2026 నాటి తుది ఓటరు జాబితా నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని ఓట్లను తీసేసి కచ్చితమైన, పారదర్శకతతో కూడిన జాబితాను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ముసాయిదాను 17వ తేదీనాడు ప్రచురించగా ఇందులో అనేక అభ్యంతరాలు వెలుగు చూస్తుండటం విడ్డూరంగా మారింది. 47రోజులు కొనసాగిన సర్ ప్రక్రియ చివరాఖరకు లోటుపాట్లతో ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటరు జాబితాలోని తప్పులు సవరించాల్సిన సర్ – ప్రక్రియలోనూ తప్పులు దొర్లుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారికి డ్రాఫ్ట్‌లో ఓటు హక్కు కల్పించడం కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల వివాదాస్పదం అవుతోంది. ఒక కుటుంబంలోని ఓటర్లను ఒకే పోలింగ్ బూత్‌లో చేర్చాల్సి ఉండగా చెల్లాచెదురవ్వడం కనిపిస్తోంది. తుది జాబితాలో కచ్చితమైన వివరాలు పొందుపరుస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో నమ్మకం కలగడం లేదు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎన్యుమరేషన్ ఫారాలు భర్తీ చేయని వారి వివరాలు యధాతథంగా ముసాయిదా జాబితాలో తిరిగి పునరావృతం అయ్యాయి. ఈఎఫ్(ఎన్యుమరేషన్ ఫారం)లు స్వీకరించకుండానే, వివరాలు ఇవ్వకుండానే ఇదంతా ఎలా సాధ్యమైంది? అన్నది అంతుచిక్కడం లేదు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే తిరిగి మరో ఫారం 7 నింపి ఇవ్వాలంటూ చెబుతున్నారు. సెప్టెంబర్ 16వరకు దరఖాస్తు చేస్తే పరిశీలించి తొలగిస్తామని బుకాయిస్తున్నారు. సర్ ప్రక్రియ జరిగిన 47 రోజుల పాటు ఏం చేశారు? అన్నది తేలడం లేదు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్నవారికి ఎదురవుతుంది. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే ఒక చోట మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పిస్తాడు. మిగిలిన చోట సమాచారం సమర్పించని కారణంగా ఆటోమెటిక్‌గా ఓటును తొలగించాలి.
విచిత్రంగా ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరించకుండానే, సమాచారాన్ని నింపకుండానే ఓటరు పేరు, వివరాలను ముసాయిదాలో అచ్చు వేయడం ఎలా జరిగిందని? పలువురు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు సంతకం పెడితేనే ఆమోదం తెలిపాలి. కానీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తుల ద్వారా ఎవరైనా దొంగ పత్రాలు సమర్పించారా? లేదంటే బీఎల్వోలు అత్యుత్సాహంతో డిజిటలైజేషన్ పూర్తి చేశారా? అన్నది అర్థం కావడం లేదు.
ఉద్యోగ రీత్యా బదిలీలు ఎదుర్కొనే వారికి ఇలాంటి ఘటనలు అనుభవంలోకి వస్తున్నాయి. ఎన్యుమరేషన్ ఫారాల సంగతి ఇలా ఉంటే… 2002లోనే ఓటరుగా నమోదైన ఉన్న వారి వివరాలను చెల్లాచెదురు చేశారు. ఒక కుటుంబంలో ఏడుగురికి ఓటు హక్కు ఉంటే వారిని ఒకే పోలింగ్ బూత్‌లో పేర్కొనాలి. అలా జరగలేదు. ఒకే ఇంటి అడ్రస్ కలిగిన వారిని రెండేసి పోలింగ్ బూత్‌ల్లో పలు చోట్ల చేర్చారు.
సర్‌తో సామాన్య జనంలో భయం పట్టుకుంది. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఇబ్బంది అవుతుందనే జంకుతో పాటుగా ఉన్న ఓటును కాపాడుకోవాలనే భయం వెంటాడుతోంది. కానీ యంత్రాంగం చేస్తోన్న తప్పిదంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఓటరు సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ప్రజలకు అనవసరమైన తలపోటు ఎదురవుతోంది. జూన్ 25న ప్రారంభమైన ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ నుంచి ఆగస్టు 10వరకు అనేక మంది ఇక్కట్లు వరుసగా వస్తున్నాయి. 2002 సర్ – ఓటరు జాబితాలో తల్లిదండ్రులు, సంరక్షణకుల పేర్లను జోడించుకోవడం, వారి వివరాలు రాబట్టుకోవడం గగనమైంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు(బీఎల్వో)లను సంప్రదించాలని ఎన్నికల అధికారులు సూచించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కొన్ని చోట్ల ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదు.
మరికొన్ని చోట్ల రెండు ఇవ్వాల్సిన చోట ఒకే ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరికొన్ని చోట్ల నేరుగా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు పిలిపించుకుని డిజిటలైజేషన్ చేపట్టారు. ప్రక్రియ ఏ రూపంలో జరిగినప్పటికీ సవ్యంగా పూర్తవ్వాలి. కొన్ని చోట్ల వెలుగు చూస్తున్న అస్తవ్యస్త పరిస్థితులతో గందరగోళం చోటు చేసుకుంటోంది. అక్టోబర్ 19న వెలువడే తుది జాబితాలో తప్పులను సవరిస్తారా? ఒక కుటుంబానికి చెందిన ఓట్లను ఒకే పోలింగ్ బూత్‌ల్లో చేర్చుతారా? లేదా? అన్నది అంతుచిక్కడం లేదు. ఈ విషయంపై స్పందించేందుకు ఎన్నికల అధికారులు సైతం సాహసించడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లా ఎన్నికల అధికారులు సైతం విఫలం చెందుతున్నారు.