Urban MLA | కంటేశ్వర్, ఏప్రిల్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించి రైతులను పరామర్శించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీ గింజా కొంటామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందని, గత పదిహేను రోజుల నుండి తెలంగాణాలో అకాల వర్షాలకు రైతులు తమ పండించిన పంట నష్టపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. రైతన్నలు పండించిన వరి పంట అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారని, కొనుగోలు కేంద్రాలలో బస్తాల కొరత, హమాలీ కొరత, ట్రాన్స్ పోర్ట్ లారీల కోరత కారణంగా రైతన్నలు మండుటెండలో రోజుల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఉందని వాపోయారు.
ఇందూర్ జిల్లాలో ఇప్పటివరకు కనీసం 40శాతం వడ్ల కొనుగోలు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్ల పైన ఉన్న శ్రద్ధ రైతుల పై లేదని ఏద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 బోనస్ అంతా బోగస్ అని రైతు పండించిన పది రకాల పంటలకు బోనస్ ఇస్తానని కేవలం సన్న వడ్లకే ఇచ్చి చేతులు దులుపుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు నష్టపోకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎటువంటి తరుగులు తీయకుండా, బస్తాల కోరత, హమాలీ కోరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హితబోధ చేశారు. రైస్ మిల్లర్ల సమస్య, కొనుగోలు కేంద్రాలలో ఉన్న పలు సమస్యలపై అదనపు కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి త్వరతగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్ధిక భరోసాగా ఫసల్ భీమా యోజన అమలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని తక్షణమే ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఇంచార్జ్ శకుంతల, బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.