నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 24 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ పిలుపునిచ్చారు. నగర శివారులోని పాంగ్రా బ్యాంకు కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాలులో 4వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని శనివారం నిర్వహించి బూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. నూతనంగా నియామకమైన బూత్ కమిటీ సభ్యులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు, మాధవనగర్ సొసైటీ చైర్మన్ నాగేశ్వర్రావు, నాయకులు ప్రేమ్దాస్నాయక్, బొల్లెంక గోపాల్‌రెడ్డి, గోపాల్‌నాయక్, నర్సింహాచారి, రాములు, రామకృష్ణ పాల్గొన్నారు.
మానసాని చెరువు గేట్లు ఎత్తివేత
మోపాల్ (ఖలీల్‌వాడి), డిసెంబర్ 24 : మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలోని మానసాని చెరువు గేట్లను ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఎంపీపీ లతా కన్నేరాం ఎత్తారు. అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీరు వదలడంతో న్యాల్కల్ మనసాని చెరువుకు వచ్చి చేరుతున్నదని, మండలంలోని గ్రామాలకు నీరందించేందుకు గేట్లు ఎత్తినట్లు తెలిపారు. కార్యక్రమంలో మోపాల్ జడ్పీటీసీ సభ్యురాలు కమలా నరేశ్, న్యాల్కల్ సర్పంచ్ ప్రసాద్, మోపాల్ సొసైటీ చైర్మన్ ఉమాపతిరావు తదితరులు పాల్గొన్నారు.