శక్కర్‌నగర్, సెప్టెంబర్ 10 : బోధన్ పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. బోధన్‌లోనూ ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నది. ఉగ్ర కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తున్న అతడి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నది. గతంలో కూడా బోధన్‌తో పాటు జిల్లాలో ఉగ్రవాదుల ఆనవాళ్లు బయటపడ్డాయి. రోహింగ్యాలు ఇక్కడ తిష్ట వేసిన ఉదంతాలు సైతం వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానాలతో యువకుడిని అరెస్టు చేసినట్లు బయటకు రావడం కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు బృందంతో పాటు ఢిల్లీ ప్రత్యేక పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బోధన్‌లో కూడా దాడులు చేశాయి. బోధన్ పట్టణంలోని అనీసానగర్లోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారు జాము నుంచే సోదాలు చేపట్టారు. మారణాయుధాలు లభ్యం కావడంతో అనుమానుతుడ్ని (20) అదుపులోకి తీసుకుని విచారించారు. అతనితో స్థానికంగా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయా? అనే దిశలో దర్యాప్తు అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. సుదీర్ఘంగా విచారించిన అనంతరం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నట్లు సమాచారం. పోలీస్ బాస్ కూడా బోధన్‌లోనే మకాం వేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అయితే, సోదాలు, అరెస్టుపై వివరణ కోరేందుకు పట్టణ పోలీసులను ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.
బోధన్‌లో కేంద్ర దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించడం స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. స్థానిక పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకపోయినా, నిందితుడికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. గతంలోనూ బోధన్‌లో ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదుల ఆనవాళ్లు బయటపడ్డాయి. దొంగ పాస్‌పోర్టులకు అడ్డా అన్న విషయం వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు బోధన్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కేంద్ర బృందాలు పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. గతంలో రాకాసీపేట్ ప్రాంతానికి చెందిన ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
నిజామాబాద్ జిల్లాలో గతంలో పలుమార్లు ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. కరుడు గట్టిన ఉగ్రవాదులు ఇక్కడ ఆశ్రయం పొందినట్లు వెలుగు చూసింది. నిజామాబాద్‌లో తలదాచుకుంటూ కార్యకలాపాల నిమిత్తం జగిత్యాలకు వెళ్తున్న కరుడు గట్టిన ఉగ్రవాది ఆజాం ఘోరీని ఏప్రిల్ 6, 2000 రోజున నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.