రాష్ట్రం పేరిట ఉమ్మడి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన తెలంగాణ యూనివర్సిటీకి ప్రాధాన్యం కరువైంది. పాలకుల అశ్రద్ధ, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వందల సంఖ్యలో ఉన్న కళాశాలలకు కేంద్రబిందువైన విశ్వవిద్యాలయంలో.. ఓ ఇంజినీరింగ్ కాలేజీ లేకపోవడం శోచనీయం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా.. ఇప్పటి వరకూ ఆ దిశగా ప్రయత్నాలు జరుగకపోవడం విడ్డూరం.
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కోస్గి పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. గత విద్యా సంవత్సరంలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వనపర్తికి ఇదివరకే కాలేజీలు వచ్చేశాయి. ఆదిలాబాద్లో కళాశాల ఏర్పాటుపై గతేడాదే ప్రకటన వచ్చినా.. అప్పటికే కౌన్సెలింగ్ తేదీలు ముగియడంతో ప్రారంభానికి వీలుకాలేదు. కానీ నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటై 17ఏండ్లు గడుస్తున్నా ఇంజినీరింగ్ కళాశాలకు నోచుకోలేదు. వర్సిటీ అధికారుల ప్రయత్నం లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికైనా చొరవ చూపితే వచ్చే విద్యాసంవత్సరానికైనా జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించుకునే వీలుంటుంది.
టీయూ మూడు ప్రాంగణాలతో కొనసాగుతున్నది. వర్సిటీ ప్రారంభించినప్పుడే ప్రధాన ప్రాంగణంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత కోర్సులను ప్రారంభించడంలో పాలకవర్గంలో ఉన్నవారు, అధికారులు విఫలమయ్యారు. టీయూ పాలకవర్గంలోని వ్యక్తులు తరచూ వివాదాల్లో చిక్కుకోవడంతో ఈ దిశగా ప్రయత్నాలు జరుగలేదు. రెండేండ్ల క్రితం జేఎన్టీయూ అధికారులు జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ముందుకొచ్చినా, ప్రభుత్వం నుంచి అనుమతులు లభించలేదు.
తెలంగాణ వర్సిటీ ఉపకులపతిగా పనిచేసిన రవీందర్గుప్తా అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇన్చార్జి వీసీ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శికి అప్పగించారు. ప్రస్తుతం ఈ హోదాలో ఉన్న బుర్రా వెంకటేశం తాజాగా కోస్గి పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కళాశాలగా ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇదే తరుణంలో టీయూలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రారంభ అవశ్యకతను పరిపాలనా పదవుల్లో ఉన్నవారు ఇన్చార్జి వీసీ దృష్టికి తీసుకెళ్తే అనుమతులు వచ్చే అవకాశమున్నది.
వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం అందుబాటులో ఉంది. ఈ ఫ్యాకల్టీతోనే కోర్సులను ప్రారంభించుకునే అవకాశం ఉన్నది. కళాశాల ఏర్పాటయ్యాక కోర్సుల ఆధారంగా నియామకాలపై దృష్టి సారించవచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇంజినీరింగ్ విద్య అందుబాటులోకి తేవాలంటే ఉన్నత విద్యాశాఖ నుంచి అనుమతులు తప్పనిసరి. ఇందుకు వర్సిటీ అధికారులే ముందుగా చొరవచూపాలి. ఇప్పటి నుంచే ఆ ప్రక్రియ ప్రారంభిస్తే వచ్చే విద్యాసంవత్సరానికైనా కోర్సులు మంజూరయ్యే అవకాశముంటుంది.
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు జేఎన్టీయూ ముందుకొచ్చింది. ఇందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం కోసం ఇదివరకే ప్రతిపాదనలు కూడా పంపింది. ఇవి విద్యాశాఖ వద్దే ఉన్నాయి. మన ప్రాంత వర్సిటీకి ఇన్చార్జి వీసీగా ఉన్న బుర్రా వెంకటేశం.. ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యా కమిషనర్గా ఉన్నారు. ఆయన చొరవ చూపితే జేఎన్టీయూ ప్రతిపాదనలకు ప్రభత్వం నుంచి ఆమోద ముద్రపడి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటయ్యే అవకాశముంది. ఈ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు సైతం కృషి చేయాలని జిల్లా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.