తెలంగాణ యూనివర్సిటీకి త్వరలోనే కొత్త వైస్ చాన్సలర్ వచ్చే నియమితులయ్యే అవకాశమున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీల నియామకం కోసం ఏర్పాటైన సెర్చ్ కమిటీ అక్టోబర్ 4వ తేదీన భేటీ కానున్నది. ఈ సమావేశంలో టీయూకు సంబంధించి ముగ్గురి పేర్లను ఖరారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నది. సెర్చ్ కమిటీ భేటీ నేపథ్యంలో ఆశావహులతోపాటు వర్సిటీ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. వీసీ పదవిపై కన్నేసిన ఆశావహులు జోరుగా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకం కోసం ప్రభుత్వం గతంలోనే సెర్చ్ కమిటీని నియమించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. కానీ, సెర్చ్ కమిటీ భేటీ కాకపోవడంతో వీసీల నియామక ప్రక్రియలో ముందడుగు పడలేదు. అయితే, అక్టోబర్ 4న కమిటీ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్న కమిటీ.. కొందరి పేర్లను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించనున్నది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ యూనివర్సిటీకి కొత్త వీసీగా ఎవరు వస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. చాలా మంది పోటీ పడుతుండడంతో నియామకంలో ఎలాంటి అర్హతలను ప్రాతిపదిక తీసుకుంటారు? అన్నది ఉత్కంఠకు దారి తీస్తోంది. పైరవీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసి రాజకీయ నియామకాలను చేపడుతుందా? లేదంటే నైపుణ్యం అర్హతగా తీసుకుని విలువలతో కూడిన వ్యక్తులను వీసీగా నియమిస్తుందా? అన్నది విద్యార్థుల్లో చర్చకు దారి తీస్తోంది.
తెలంగాణ యూనివర్సిటీలో పాలన పూర్తిగా గాడి తప్పింది. ఏడాదిన్నర కాలంగా శాశ్వత వీసీ లేడు. ఇన్చార్జ్ వీసీగా సీనియర్ ఐఏఎస్‌లను నియమించినా వాళ్లు ఇక్కడకు వచ్చిందీ లేదు. పాలనను గాడిలో పెట్టిందీ లేదు. వర్సిటీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిస్థితి దాపురించింది. శాశ్వత వీసీని నియమిస్తే తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశముంది. వసతి గృహాల్లో పరిస్థితి అధ్వానంగా మారుతున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో బాధ్యులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. భోజనంలో బల్లులు, పురుగులు, బొద్దింకలు రాగా, తాజాగా హాస్టళ్లలో పాములు చక్కర్లు కొడుతుండడం విద్యార్థులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నది.
వీసీ పోస్టు కోసం పలువురు ప్రొఫెసర్లు పైరవీలు చేసుకుంటున్నారు. టీయూలో గతంలో పని చేసి వెళ్లిన వారితో పాటు ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న వారు సైతం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. టీయూలో ఏడాదిన్నరగా చోటు చేసుకుంటున్న పరిణామాలను దగ్గరి నుంచి చూస్తున్న కీలక వ్యక్తి సైతం ఇక్కడ తిష్ట వేసేందుకు జోరుగా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, అనేక అవినీతి ఆరోపణలు, గత వీసీతో అంటకాగిన ఘటనలు మైనస్‌గా మారుతుండడంతో సదరు వ్యక్తి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
ఆయనకు అవకాశం రాకపోతే, కాంగ్రెస్ నాయకుడి బంధువు ఒకరు వీసీగా వచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతున్నది. ఉన్నత విద్యా మండలిలోనూ చక్రం తిప్పుతున్న వారు సైతం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు బోధన్, రూరల్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డా.భూపతిరెడ్డిని మచ్చిక చేసుకుంటున్నట్లు చర్చ నడుస్తున్నది. నైపుణ్యం ఆధారంగానే వీసీని నియమించాలని, బంధుప్రీతి, రాజకీయ సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ పేరు మరింత దిగ జారుతుందని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.