కామారెడ్డి, మార్చి 8 : కన్న తండ్రే తన పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తనను నమ్మి ఆటోలో వచ్చిన కన్న కూతుళ్లను చెరువులోకి తోసేసి హత్యకు పాల్పడ్డాడు. అనంతరం తన పిల్లలు కనిపించడంలేదంటూ నమ్మించడానికి యత్నించగా, పోలీసుల దర్యాప్తులో తండ్రి చేసిన దారుణం బయటపడింది. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముగ్గురు పిల్లల అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాయంత్రం ముగ్గురు పిల్లల మృతదేహాలను కామారెడ్డి పెద్ద చెరువులో గుర్తించి బయటికి తీశారు.
పిల్లల మృతిపై విచారించిన పోలీసులకు తండ్రిపై అనుమానం రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే పిల్లలను హత్యచేసినట్లు ఒప్పుకున్నాడని ఏఎస్పీ చైతన్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అదృశ్యమైన ముగ్గురు కూతుళ్లను కన్న తండ్రి ఇస్మాయిల్ హత్య చేశాడని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్లు సీపాత్ (8), అయాత్ (7), మరియం (5) శనివారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు.
దీంతో ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టినట్లు చెప్పారు. పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లారో సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టి, పరారీలో ఉన్న తండ్రి హత్య చేసి ఉంటాడని అనుమానించామని తెలిపారు. పరారీలో ఉన్న తండ్రి ఇస్మాయిల్‌ను ఆదివారం పట్టుకొని విచారించగా, అప్పులు, ఆర్థిక భారం, ముగ్గురు కూతుళ్లను పోషించలేక తానే వారిని కామారెడ్డి పెద్ద చెరువులో తోసేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.
శనివారం రాత్రి గజఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించగా, అయాత్, మరియం చిన్నారుల మృతదేహాలు లభించాయని, సీపాత్ మృతదేహం కోసం గాలించగా అర్ధరాత్రి వెలికితీశారని వివరించారు. మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం కోసం తరలించినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీన అదృశ్యమైన గోసంగి కాలనీకి చెందిన ఇద్దరు పిల్లలను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు నరహరి, రామన్ తదితరులు పాల్గొన్నారు.