సిటీబ్యూరో, జూలై 26(నమస్తే తెలంగాణ) : మూసీ నది ప్రక్షాళన, సుందీరకరణ కోసం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. మూసీ పునర్జీవం పేరిట దాదాపు రూ. 7,500 కోట్ల మేర భారీ ప్రతిపాదనలు, అంచనాలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం ఆ శాఖను కేవలం రిటైర్డ్ ఉద్యోగుల పునరావాస కేంద్రంగా మార్చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ. వేల కోట్ల ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నడిపించడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటితో ఈ తీరుతో స్పష్టమవుతున్నది.
మూసీ అథారిటీలో కీలకమైన సాంకేతిక, పరిపాలన బాధ్యతలను శాశ్వత ప్రతిపాదికన నియమితులైన నిపుణులు, అధికారులకు అప్పగించాల్సిన సర్కార్.. రిటైర్డ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టి ప్రయోగాలు చేస్తోంది. గతంలో జలమండలి, హెచ్ఎండీఏ, ఇతర విభాగాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన, లేదా డిప్యూటేషన్ పేరిట ఇతర శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులకు మూసీ బాధ్యతలు అప్పగించింది. మూసీ అథారిటీలో కొందరిని ఒప్పందం ప్రాతిపదికన, మరికొందరిని రిటైర్డ్ ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ సర్వీసులోకి తీసుకున్నది. సర్వీసులో ఉన్నప్పుడే పెద్దగా ప్రతిభ చూపలేకపోయిన అధికారులను కూడా
కేవలం రికమెండేషన్లతో కీలక పదవుల్లో కూర్చోబెడుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 7,500 కోట్ల వ్యయంతో ముడిపడిన భారీ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పదవుల్లో ఒక్కరంటే ఒక్కరూ శాశ్వత ప్రాతిపదికన పనిచేసే అధికారి లేకపోవడం యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. ప్రాజెక్టు పర్యవేక్షణ, డిజైనింగ్, ఇంజినీరింగ్ అంచనాలు, పర్యావరణ అనుమతులు వంటి బాధ్యతలు మోయాల్సిన చోట తాత్కాలిక, రిటైర్డ్ సిబ్బందితో కాలం వెల్లదీస్తోంది. రేపు ప్రాజెక్టు అమలులో ఏమైనా వైఫల్యాలు లేదా, అక్రమాలు జరిగితే ఎవరినీ జవాబుదారి చేసే అవకాశం కూడా ఉండదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మూసీ ప్రక్షాళన, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, నదీ పరివాహక ప్రాంతాభివృద్ధి వంటి అంశాలు పర్యావరణవేత్తలు, అర్బన్ ప్లాన్లు, రివర్ రీస్టోరేషన్ నిపుణులతో ముడిపడి ఉన్న శాస్త్రీయమైనది. అయితే మూసీ అథారిటీ యంత్రాంగం ఇప్పటివరకు ఏ ఒక్క అంతర్జాతీయ లేదా, జాతీయ స్థాయి పర్యావరణ, నదీ పునర్జీవన నిపుణుడితో సంప్రదింపులు జరపకపోవడం గమనార్హం. కేవలం డ్రాయింగ్ రూమ్ ప్రణాళికలు, రిటైర్డ్ ఉద్యోగుల పాత పద్ధతులకే పరిమితమై అంచనాలు తయారు చేయడం తప్పా.. .శాస్త్రీయ దృక్పథం ఎక్కడా కనిపించడం లేదు.
మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం నిధుల ప్రతిపాదనలకు ఇచ్చిన ప్రాధాన్యత వాటిని సమర్థవంతంగా పట్టాలెక్కించడంపై దృష్టి పెట్టడం లేదు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ప్రచారం చేసుకుంటున్న మూసీ అథారిటీని నిపుణులతో కాకుండా రిటైర్డ్ ఉద్యోగులకు పోస్టింగ్ ఇచ్చే కేంద్రంగా మార్చడం వెనుక అంతర్యమేంటని ప్రజలు, పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభు త్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని, శాశ్వత నిపుణులను, ఎలాంటి ఆరోపణలు లేని ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి పారదర్శకత చాటుకోవాలని, లేదంటే మూ సీ అథారిటీ పేరిట సర్కారే దోపిడీకి తెరలేపేందుకు అనర్హులకు అందలం ఎక్కిస్తుందనే భావన జనాలకు కలుగుతుందంటున్నారు.