జహీరాబాద్, మార్చి 8 : ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా ఎండలు పెరగడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే నిప్పులకుంపటిలా మారుతున్నది. దీంతో అడుగు బయట పెట్టేందుకు జనం జంకుతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయం త్రం వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వడదెబ్బ బారినపడకుండా ప్రజలు శీతలపానీయాల కేంద్రాలను ఆశ్రయిస్తున్నా రు. ఫ్యాన్లు, కూలర్ల కింద ఉపశమనం పొం దుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వీధి వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండతీవ్రతకు తట్టుకోలేక వాహనదారులు రోడ్ల పక్కనే ఉన్న చెట్ల కింద సేదతీరుతున్నారు. ఆత్యవసరం అనుకుంటే ఉదయమే ప్రయాణం చేస్తున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన హె చ్చరికలు జనాలను భయపెట్టేలా ఉన్నాయి. మూడు రోజుల నుంచి ఉదయం తొమ్మిది గంటలకే ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండలు పెరిగిపోతుండడంతో పాటు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతుండడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడబెబ్బ తగలకుండా, ఎండనుంచి ఉపశమనం కోసం జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్, మేలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
రామాయంపేట మండలంలో…
రామాయంపేట, మార్చి 8: రామాయంపేట పట్టణంలోని రాజేంద్రనగర్, మహంకాళి మార్కెట్ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ వేడిమికి గ్రామాల్లో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడకతప్పడం లేదు. వేడిమిని తట్టుకోలేక దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చల్లటి పానీయాల వైపు మెగ్గుచూపుతున్నారు. కూల్డ్రింక్స్, కొబ్బరిబొండాలు, ఐస్క్రీమ్లు, చెరుకు రసం, దోసకాయలు, అంబలి తాగుతున్నారు. ఎండలకు భయపడి గ్రామీణ ప్రాంత ప్రజలు రామాయంపేటకు రావడం లేదు.లావాదేవీలు లేక రద్దీగా ఉండే దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఎండ ఎక్కువగా ఉండే మధ్యాహ్నం ప్రధాన కేంద్రాలతో పాటు బస్టాండ్, సిద్దిపేట చౌరస్తా, మెదక్ చౌరస్తాలో ప్రయాణికులు కనపడటం లేదు. దశాబ్దాల కాలంగా లేని ఎండల తీవ్రత ఇప్పుడే కనిపిస్తుందని సీనియర్ వృద్ధులు వాపోతున్నారు. ప్రస్తుతం ఎండలు 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.