బాల్కొండ(మోర్తాడ్), మార్చి 8: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ముస్లింలలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి రెసిడెన్షియల్ పాఠశాలలు, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక వినూత్న పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. బాల్కొండ మండల కేంద్రం లో ముస్లింలతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో వేముల పాల్గొన్నారు. వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభు త్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ సరిగ్గాలేదని ప్రజలకు అందుతున్న అనేక పథకాలు ఇప్పు డు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
షాదీఖానా నిధులను నిలిపేశారు..
తాను మంత్రిగా ఉన్న సమయంలో బాల్కొండలో షాదీఖానా నిర్మాణం కోసం సెక్రటేరియట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతితో సుమారు రూ. 30 లక్షల
నిధులు మంజూరు చేయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా పాత జీవోలను అభివృద్ధి పనులను కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంటుందని తెలిపారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎందుకు నిలిపివేస్తున్నారని కాంగ్రెస్ నాయకులను, ప్రభుత్వాన్ని నిలదీయాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. బాల్కొండ షాదీఖానా నిర్మాణం కోసం తాను వ్యక్తిగతంగా పోరాడతానని, నిధు లు వచ్చే వరకు విశ్రమించబోనని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, , మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.