హైడ్రా ఒక విధ్వంసకర ఆలోచన.. ఇది బ్లాక్మెయిల్ టూల్‌గా పనిచేస్తున్నది. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ఇండ్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదు.. పేదల ఇండ్లను మాత్రమే కూలుస్తున్నది. అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దుచేస్తం -కేటీఆర్
రాష్ట్రంలో త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు.రాజకీయాల్లో ‘ట్రిపుల్ ఆర్’ అంటే.. రీకాల్ – గత బీఆర్ఎస్ పాలనను ప్రజలు గుర్తుచేసుకోవడం.. రిగ్రెట్ – కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశామని పశ్చాత్తాప పడటం. రివోల్ట్ – ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం.. ఈ మూడు దశలు త్వరలోనే రానున్నయ్. ఊర్లళ్ల కాంగ్రెస్ నాయకులను ఉరికిస్తరు. ఢిల్లీలో ఎలాంటి దృశ్యాలు చూస్తున్నారో, భవిష్యత్తులో తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే సీన్లు పునరావృతం అవుతయ్. -కేటీఆర్
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఆర్’ ఉద్యమం రాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. రేవంత్సర్కార్ తీరు, బీజేపీ, హైడ్రా, గత ఎన్నికల్లో ఓటమి.. తదితర అంశాలపై ఆయన స్పందించారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో నడుస్తున్నది సర్కార్ కాదని.. సర్కస్ నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కేసీఆర్ నేతృత్వంలోని సర్కారేనని ధీమా వ్యక్తంచేశారు. రేవంత్ సర్కార్‌కు ప్రజలు
కర్రు కాల్చి వాతపెట్టే రోజు దగ్గర్లోనే ఉన్నదని చెప్పారు.
త్వరలో ‘ట్రిపుల్ ఆర్’ ఉద్యమం
రాష్ట్రంలో త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాజకీయాల్లో ‘ట్రిపుల్ ఆర్'(రీకాల్, రిగ్రేట్, రివోల్ట్) ఉద్యమం తప్పదని పేర్కొన్నారు. ‘రీకాల్ అనగా బీఆర్ఎస్ పాలనను ప్రజలు గుర్తుచేసుకోవడం, రిగ్రెట్ అనగా కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని పశ్చాత్తాపపడటం, రివోల్ట్ అనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయడం’ అని పేర్కొన్నారు. ఈ మూడు దశలు త్వరలోనే రానున్నాయని, గ్రామాల్లో కాంగ్రెస్ లీడర్లను ప్రజలు పరుగులు పెట్టించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి దృశ్యాలు చూస్తున్నారో.. త్వరలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే పరిస్థితి ఎదురుకాబోతున్నదని చెప్పారు.
అంచనాల్లో తేడా వల్లే ఓటమి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలపై కేటీఆర్ స్పష్టతనిచ్చారు. ‘ఓటమికి కారాణాలు తెలువదు అనడం తప్పు.. స్పష్టంగా తెలుసు’ అంటూ కొన్ని పొరపాట్లను గుర్తు చేసుకున్నారు. కొందరు అభ్యర్థుల మార్పు, పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) మేనేజ్మెంట్లో లోపాలు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. సమాజంలో వచ్చిన మార్పులను అంచనా వేయడంలో కొంత వెనుకబడ్డామని తెలిపారు. సమాజం ఎంతగా మారిందో అర్థం చేసుకోవడంలో కొంత వెనుకబడ్డామని అంగీకరించారు. ఉదాహరణకు.. రైతుబంధు అందరికీ ఇచ్చామని తాము భావిస్తే, ప్రజల్లో మాత్రం ‘నాకంటే ఎకువ భూమి ఉన్నోడికి, వంద ఎకరాలు ఉన్నోడికి ఎందుకు ఇచ్చారు?’ అనే కోణంలో చర్చ జరిగిందని, దీనిని ముందే అంచనా వేయలేకపోయామని తెలిపారు కేసీఆర్, కేటీఆర్‌లకు అహంకారం వచ్చిందని ప్రచారం చేశారని, తాను ఎప్పుడైనా విద్యార్థులు, సామాజిక వర్గాలను బూతులు తిట్టానా.. అని ప్రశ్నించారు. తనకు ఆత్మవిశ్వాసం ఎకువని, గట్టిగా మాట్లాడితే అది అహంకారంగా కనిపిస్తున్నట్టున్నదని పేర్కొన్నారు అది తన ‘మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్’ కావొచ్చని సరదాగా వ్యాఖ్యానించారు
సంపద సృష్టిస్తేనే పేదలకు సంక్షేమం
చరిత్రలో ఏ పెనుమార్పు వచ్చినా మనుషులు తొలుత చెడు గురించే ఎకువగా ఊహిస్తారని, అలాగే ఏఐ వల్ల కూడా రకరకాల ఆందోళనలు వ్యక్తవమవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వాలు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రంగాల్లో ఏఐని గేమ్ ఛేంజర్‌గా వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీని టూల్‌గా మాత్రమే వాడాలని, ఓవర్ డిపెండ్ కావొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ.94,000 ఉండగా, తాము దిగిపోయేనాటికి రూ.3,27,000కుకి చేరి దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. ‘సంపద పెంచడం.. పేదలకు పంచడం’ అనే ఫిలాసఫీతోనే తాము ముందుకెళ్లామని స్పష్టం చేశారు.
సినిమా రంగం, నంది అవార్డులపై స్పందిస్తూ..
సినిమా ఇండస్ట్రీకి పదేండ్లుగా నంది అవార్డులు ఇవ్వాలన్న నిర్ణయం ఎందుకు జరుగలేదో తనకు వ్యక్తిగతంగా తెలియదని కేటీఆర్ బదులిచ్చారు. రాచకొండ వద్ద సుమారు 2,500 ఎకరాల్లో హాలీవుడ్‌ను మించిన అతిపెద్ద స్టూడియో కట్టాలని కేసీఆర్‌కు విజన్ ఉండేదని, కొంత భూ సేకరణ కూడా జరిగిందని, అది కార్యరూపం దాల్చేలోపు ప్రభుత్వ మార్పు జరిగిందని తెలిపారు
కాళేశ్వరం ప్రాజెక్టుపై దీటైన సమాధానం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. 2014కు ముందు తెలంగాణలో కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండగా, కేసీఆర్ హయాంలో సాగునీటి విస్తీర్ణం పెరిగి నేడు తెలంగాణ భారతదేశానికి ధాన్య భాండాగారంగా మారిందని గణాంకాలు సహా తెలిపారు. ఈ ప్రాజెక్టు కారణంగానే ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులకు పెరిగిందని, దీనిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేరొన్నారు.
బీజేపీతో కలిసేదే లేదు..
బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అన్న ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. రాష్ట్రంలో బీజేపీకి సంస్థాగతంగా బలం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ నాయకులు ఓడిపోయారని గుర్తుచేశారు. నాడు మోడీకి ఉన్న చరిష్మాతోనే ఎంపీ సీట్లు సాధించగలిగారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీతో ఎలాంటి అండర్ స్టాండింగ్ ఉండబోదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
హైడ్రా ఒక బ్లాక్మెయిల్ టూల్
రాష్ట్రంలో హైడ్రా తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైడ్రా అనేది ఒక విధ్వంసకర ఆలోచన. ఇదో బ్లాక్ మెయిల్ టూల్‌గా మారిందని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు, మంత్రుల నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని ఆధారాలు సహా చూపించినా స్పందనలేదని విమర్శించారు. పేదల ఇండ్లను కూల్చివేస్తూ, పెద్దల భవనాలను పట్టించుకోకపోవడం హైడ్రా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తామని స్పష్టంచేశారు. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టులో ఒకటి, బయట ఒకటి చెబుతూ ప్రభుత్వం ఒక సరస్లా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ పథకాలకు పైసలు లేవని, కానీ మూసీ ప్రక్షాళనకు మాత్రం నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో ఓటమికి కారణాలు తెలువదు అనడం తప్పు.. కొన్నిచోట్ల అభ్యర్థులను మార్పు చేయాల్సి ఉండె.. ప్రజల అంచనాలను అందుకోవడంలో కొంత వెనుకపడిపోయాం..మాపై జరిగిన దుష్ప్రచారాన్ని సరైన రీతిలో తిప్పికొట్టలేకపోయాం.. ఇలాంటి
కారణాలెన్నింటినో స్పష్టంగా తెలుసుకున్నం.. -కేటీఆర్
రాష్ట్రంలో బీజేపీకి సంస్థాగత బలం లేదు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ప్రభావమేమీ చూపలేకపోయారు.. నాడు మోదీ చరిష్మాతో ఎంపీ సీట్లను మాత్రం గెల్చుకున్నారు.. ఇప్పుడా పరిస్థితి కూడా లేదు.. బీజేపీతో రాష్ట్రంలో ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండబోదు.
-కేటీఆర్