హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఆయన వేదవిద్యలో ఘనాపాటి.. తన శాఖకు సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఎన్నో సర్టిఫికెట్లు సంపాదించారు. అరుదైన వేదపండితుల్లో ఒకరిగా చిన్న వయసులోనే పేరుపొందారు. అటువంటి వేదపండితుడికి ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయం జరిగింది. టీటీడీ వేదపారాయణదారు పోస్టుకు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చారు. కానీ, ఆయనకు స్థానికత అడ్డంకిగా మారింది. ఆయనకు పోస్టు కచ్చితమని చెప్పిన గురువులు, వేదపండితులు ఈ విషయం తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత దారుణంగా నియామక ప్రక్రియ జరిగిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే.. పది నుంచి పదిహేను మంది వరకు వేదంలో అద్భుతమైన ప్రతిభతో దేశవిదేశాల్లో రాణిస్తున్నా, స్థానికంగా ప్రభుత్వ, టీటీడీ ఉద్యోగాల వరకు వచ్చేసరికి విఫలమవుతున్నారు.
తాము చెప్తున్న పన్నంలో తేడా ఉన్నదా? లేక స్థానికతే తమకు అడ్డంగా మారిందా? అనేది వాళ్లకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. టీటీడీలో వేదపారాయణదారు నియామకాలకు సంబంధించి తెలంగాణ పండితులు 20 మందిలోపే ఎంపిక కావడంపై వివాదం ముదురుతున్నది. ఎంపికైనవారిలోనూ ఎక్కువ మంది స్థానిక టీటీడీల్లో పనిచేస్తున్న వారి కొడుకులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గురువుల వద్ద విద్యనభ్యసించినవారని.. ఇలా ఏదో ఒక కొలమానం ఉంటేనే వారికి ఉద్యోగం దక్కిందనే ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ వారికి స్థానికతే అడ్డుగా మారిందంటూ ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ‘శ్రీవారి సేవకు ప్రాంతీయ పరీక్ష’ శీర్షికన ప్రచురితమైన కథనం రెండు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించింది. ఈ కథనంలో వచ్చిన వివరాలన్నీ వాస్తవమని పరీక్షలకు హాజరైన తెలంగాణ అభ్యర్థులు చెప్తుండగా, తమకు కూడా అన్యాయం జరిగిందంటూ కొందరు ఆంధ్రా పండితులు కొత్త చర్చకు తెరలేపారు.
గతంలో జరిగిన వేదపారాయణదారు నియామకాల్లో ఆంధ్రావారికి అవకాశం కల్పించినా తాము అడ్డుకోలేదని తెలంగాణ పండితులు చెప్తున్నారు. కానీ ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో వారే ఉద్యోగాలు తన్నుకుపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. పరీక్షల మార్కులు వచ్చిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ వేసి తమకు అన్యాయం చేయడం వెనుక పెద్ద తతంగమే ఉన్నదని ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఆంధ్రాలో కూడా తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు పండితులు ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్ చేసి చెప్పారు. వేదపారాయణదారు పోస్టుల్లో తమవారిని నింపుకోవడానికి కొందరు పరీక్షాధికారులు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన వారు తమను తొక్కిపెట్టారంటూ వారు ఆవేశంగా చెప్పారు. అన్ని అర్హతలు ఉన్నా తమను కాదని, కేవలం కొందరి ఇంటి పేర్లు కలిగిన వారికే పట్టం కట్టారని ఆరోపించారు.
క్రమాపాఠి, ఘనాపాఠిల ఎంపిక ప్రక్రియలో ఆంధ్రా వారికి అర్హత మార్కులను 85 మార్కుల నుంచి 40 మార్కులకు తగ్గించడంతో చాలామంది అర్హత లేనివారు, సర్టిఫికెట్లు లేనివారికి కూడా ఉద్యోగాలు దక్కాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ సిఫార్సుతో కొందరు అర్హత లేనివారికి కూడా ఉద్యోగాలు దక్కాయని అభ్యర్థులు ఆరోపించారు. కొందరైతే ఒకటి రెండు పరీక్షలు కూడా పూర్తిగా ఇవ్వలేదని, సభలు జరిగే ప్రాంతాలకు సంబంధించిన గురువులు తమవారే కావడంతో వారు సర్టిఫికెట్లు తీసుకొని మళ్లీ విద్యాభ్యాసం చేస్తున్నట్టు ఆంధ్రా పండితులు కొందరు తెలిపారు. ఈ అవకతవకలపై నిజనిర్ధారణ చేయాలని టీటీడీని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఎంపికకు సంబంధించి రెండు జాబితాలు విడుదల చేసి, అందులో 746 పోస్టులకు మాత్రమే నియామకాలు ఇచ్చారు. 39 మందిని ‘ప్రొవిజనల్లీ సెలెక్టెడ్’ అని పెట్టి వారిని సందిగ్ధంలో ఉంచారు. ఈ పోస్టులకు సంబంధించి పైరవీలు మొదలయ్యాయని, ఒక ముఖ్య పరీక్షాధికారి కొందరితో బేరాలు మొదలుపెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మాదిరిగానే, ఆంధ్రాలో కూడా ఈ పోస్టులకు డబ్బులు ఇప్పిస్తామంటూ పై స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారట. పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి తాను నివాసం ఉంటున్న తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపుతూ, అర్హతలతో సంబంధం లేకుండా ఆంధ్రాప్రాంతానికి ఎక్కువ ఉద్యోగాలు దక్కేలా చూశారంటూ ఆరోపిస్తున్నారు.
‘శ్రీవారి సేవకు ప్రాంతీయ పరీక్ష’ కథనంపై తెలంగాణ అర్చక సమాఖ్య ప్రతినిధులు స్పందించారు. ఈ కథనం వాస్తవమని సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గట్టు శ్రీనివాసాచారి, భాస్కరభట్ల రామశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 2004కు ముందు టీటీడీ తెలంగాణలోని దేవాలయాలు, వేద పాఠశాలలకు నిధులు కేటాయించేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ నిధులు వెనక్కు తీసుకున్నారని ఆరోపించారు. చిలుకూరు బాలాజీ దేవస్థానం వద్ద వేదపాఠశాల నిర్మాణానికి ట్రస్ట్ బోర్డు తీర్మానం చేసి నిధులు కేటాయించినట్టు జీవోలు విడుదల చేశారని, తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారని తెలిపారు.
తెలంగాణలో ఉన్న టీటీడీ కల్యాణమండపాలు దేవస్థానానికి ఆదాయ వనరుగా మారాయే తప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా కొనసాగడం లేదని పేర్కొన్నారు. గతంలో కేటాయించిన వేదపారాయణదారు పోస్టులను కూడా రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వరంగల్‌లోని బట్టలబజార్ వేంకటేశ్వరాలయమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీటీడీ రూ.1,400 కోట్ల బకాయి పడిందని వివరించారు. దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి స్పందన లేదని చెప్పారు. తెలంగాణ అర్చక వెల్ఫేర్ బోర్డులో టీటీడీ ఈవో ఇప్పటికీ సభ్యుడుగానే ఉన్నారని గుర్తుచేశారు. బకాయిలు ఇవ్వడంతోపాటు నియామకాల్లో తెలంగాణకు కచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు.
టీటీడీ నిర్వహించిన వేదపారాయణదారుల పోస్టుల ఎంపిక ప్రక్రియ ఒక కుంభకోణమని వివిధ రాష్ర్టాల వేదపండితులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిభను పక్కనపెట్టి నచ్చినవారికి పట్టం కట్టారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోస్టులన్నీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అని ముందే చెప్పాల్సిందని, వేంకటేశ్వరుడు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే చెందినవారా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ ఇచ్చి, ఇప్పుడు ఏపీ వారికే ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. ఇతర అన్ని రాష్ర్టాల అభ్యర్థులకు అన్ని శాఖల్లో అన్యాయం జరిగిందంటూ వైదిక్ సనాతన్ పరంపర అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. కర్ణాటకలో శుక్ల యజుర్వేదం, సామ, అథర్వ వేదాలకు ఒక్క పోస్టు రాకపోగా, రుగ్వేదానికి ఒక్క పోస్టు వచ్చిందని, మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి ఉన్నదని తెలిపారు. ఇది వైదికులందరినీ అవమానించడమేనని మండిపడుతున్నారు. తెలంగాణ వేద పండితుల మాదిరిగానే తాము కూడా సామాజిక మాధ్యమాల వేదికగా టీటీడీని ప్రశ్నిస్తామన్నారు.