సెయింట్ లూయిస్ (యూఎస్ఏ) : భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అమెరికా గడ్డపై సరికొత్త చరిత్ర లిఖించాడు. సెయింట్ లూయిస్‌లో భారత కాలమానం గురువారం తెల్లవారుజామున జరిగిన గ్రాండ్ చెస్ టూర్ (జీసీటీ) ఫైనల్స్‌లో 21 ఏండ్ల ఈ చెన్నై చిన్నోడు.. 15-13తో అమెరికా జీఎం ఫాబియానొ కరువానాను చిత్తుచేశాడు. తద్వారా భారత్ తరఫున ఈ టైటిల్ గెలిచిన తొలి చెస్ ప్లేయర్‌గా అతడు రికార్డులకెక్కాడు. ఫైనల్స్‌లో భాగంగా రెండు క్లాసికల్ గేమ్స్‌లో ఒక్కదాంట్లో కూడా నెగ్గకున్నా ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో తనదైన ఎత్తులతో పావులు కదిపిన ప్రజ్ఞా.. ప్రత్యర్థికి ఊహకందని కమ్‌బ్యాక్‌తో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో అతడు 2 లక్షల యూఎస్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు ఒక కోటి తొంబై లక్షల రూపాయలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు. కాగా మూడో స్థానం కోసం జరిగిన పోరులో అమెరికాకే చెందిన వెస్లీ.. జర్మనీ జీఎం విన్సెంట్ కీమర్‌పై విజయం సాధించాడు. ఈ ముగ్గురూ (ప్రజ్ఞానంద, కరువానా, వెస్లీ) వచ్చే ఏడాది జీసీటీకి నేరుగా అర్హత సాధించారు.
3-9.. రెండు క్లాసికల్ గేమ్స్ ముగిసిన తర్వాత ప్రజ్ఞా పరిస్థితి అది. తొలి గేమ్‌ను ఓడిన అతడు, రెండో గేమ్‌ను డ్రా చేసుకోవడంతో ఆరు పాయింట్ల లోటుతో టైటిల్ పోరులో ముందంజ వేయడం ఇక కష్టమే అనుకున్నారంతా. కానీ వేగంగా ముగిసే ర్యాపిడ్‌లో అంతే స్పీడ్‌తో పావులు కదపడంలో నిష్ణాతుడైన ఈ చెన్నై కుర్రాడు.. తనకు అచ్చొచ్చిన కేటగిరీలో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. తొలి ర్యాపిడ్ గేమ్ ఓటమి నుంచి తేరుకోకముందే రెండో గేమ్నూ గెలుచుకోవడంతో (గెలిస్తే ఒక్కో గేమ్‌కు 4 పాయింట్లు) స్కోరు 11-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇక నాలుగే రౌండ్లు ఉండే బ్లిట్జ్ సెక్షన్ (ఒక్కో గేమ్‌కు రెండు పాయింట్లు)లో తొలి మ్యాచ్‌లోనే విజయానికి దగ్గరగా వచ్చిన అతడు తడబడి డ్రాతో సరిపెట్టుకోవడంతో ఇరువురికి చెరో పాయింట్ దక్కింది. అయితే రెండో మ్యాచ్‌లో కరువానా గెలవడంతో స్కోర్లు 12-12తో సమమయ్యాయి. ప్రత్యర్థి దూకుడును అంచనా వేసిన ప్రజ్ఞా.. మూడో గేమ్‌ను నెగ్గడంతో 14-12తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇక ఆఖరి మ్యాచ్‌ను డ్రా చేసుకుంటే విజయం ఖాయమనున్న తరుణంలో అతడు అనుకున్నట్టుగానే గేమ్ డ్రాగా ముగించడంతో ప్రజ్ఞానంద ఖాతాలో జీసీటీ టైటిల్ ఖరారైంది.

ఈ ఏడాది మొదట్లో ప్రజ్ఞానందకు కలిసిరాలేదు. భారీ అంచనాలతో క్యాండిడేట్స్ టోర్నీ బరిలో నిలిచిన అతడు.. ఆ ఈవెంట్లో నిరాశపరిచినా తర్వాత క్రమంగా పుంజుకున్నాడు. నార్వే చెస్ టైటిల్‌ను గెలువడం ప్రజ్ఞాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ ఈవెంట్లో అతడు.. దిగ్గజ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించడం గమనార్హం. అనంతరం సెయింట్ లూయిస్, సింక్ఫీల్డ్ కప్‌లనూ గెలుచుకుని జీసీటీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. సెమీస్‌లో విన్సెంట్ కీమర్‌ను ఓడించి కరువానాతో అమీతుమీకి సిద్ధమయ్యాడు. సుమారు నెల రోజులుగా సెయింట్లూయిస్లోనే ఉండటమూ అతడి విజయానికి కలిసొచ్చింది.
వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు గెలుపు అవకాశాలున్నాయని నేను అనుకోలేదు. ఆరుపాయింట్ల తేడా అనేది చాలా పెద్ద విషయం. ఇది చాలా సవాల్‌తో కూడుకున్నది. ఫాబి వంటి ప్లేయర్‌పై ఒక్క మ్యాచ్ గెలవడమే కష్టం. కానీ వరుసగా రెండు (ర్యాపిడ్) మ్యాచ్‌లు గెలిచా. నా విజయంలో అదే కీలకమైంది. నిరుటి కంటే నా ర్యాపిడ్, బ్లిట్జ్ గేమ్స్‌లో మంచి పురోగతి ఉంది. నా దృష్టిలో జీసీటీ రెండో వరల్డ్ చాంపియన్‌షిప్‌తో సమానం. ఇక్కడ గెలవడం అద్భుతంగా ఉంది. క్యాండిడేట్స్ కూడా గెలిచుంటే బాగుండేది.!