ఇందల్వాయి, జనవరి 29: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు తీసుకురాకుండా పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఏదైనా ఉంటే ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. మండలంలోని మల్లాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడుతూ.. పల్లెల్లోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. గ్రామంలో ముదిరాజ్ సంఘం, సీసీ రోడ్డు, మహిళా భవనం, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, క్రీడాప్రాంగణంతో పాటు ఎల్లమ్మ ఆలయ నిర్మాణం వంటి కార్యక్రమాలకు దాదాపు రూ.2కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. మరింత అభివృద్ధి చేసుకోవాలంటే సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు.
ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ చైర్మన్ ఎనిమిదేండ్ల కాలంలో రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు రూ.2వేల కోట్లు నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ గడ్డం సుమనా రవిరెడ్డి, ఎంపీపీ రమేశ్ నాయక్, స్థానిక సర్పంచ్ లోలం సత్యనారాయణ, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రఘునందన్‌రావు, వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, ఎంపీటీసీ సరిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాదాస్, ప్రధాన కార్యదర్శి పులిశ్రీనివాస్, సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్, సర్పంచులు తేలు విజయ్‌కుమార్, నరేశ్, పార్టీ సీనియర్ నాయకులు పాశం కుమార్, అరటి రఘు, పులిసాగర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.