సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి గూడు కల్పించేందుకు ఆర్థిక సాయం అందించనుంది. ‘గృహలక్ష్మి’ పథకం పేరుతో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ సర్కారు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా పేదలకు గూడు కల్పించేందుకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ‘గృహలక్ష్మి’ ద్వారా ఇండ్లు లేని వారికి గృహయోగం కలుగనుంది. ఈ పథకం కింద ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మందికి లబ్ధి కలుగనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై పేదల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ దయతో తమకు నీడ దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– కమ్మర్పల్లి, మార్చి 10
కమ్మర్పల్లి, మార్చి 10: కేసీఆర్ సర్కారు చొరవతో పేదలకు సకల వసతులు సమకూరుతున్నాయి. ప్రధానంగా సొంతింటి కల నెరవేరుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలు ఆత్మ గౌరవంతో, సౌకర్యవంతంగా నివాసం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. అలాగే, సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని కేసీఆర్ సర్కారు తాజాగా నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షల చొప్పున సాయం అందించనున్నది. తద్వారా మరింత మందికి గృహయోగం కల్పించనున్నది. దీంతో ఎన్నో ఏండ్లుగా జాగా ఉండి, సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక స్థోమత లేని పేదలెందరికో గూడు లభించనున్నది. పేదల ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీనిపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సకల జనులకు సర్కారు భరోసా..
స్వరాష్ట్రం సిద్ధంచింది మొదలు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రైతుబంధు, రైతుబీమా, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా తదితర సంచలన పథకాలు అమలుచేస్తున్నది. అలాగే, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ తదితర మానవీయ పథకాలతో ప్రజలపై తన ప్రేమను చాటుకుంటున్నది. ఆయా పథకాలు లబ్ధిదారుల బతుకుల్లో సంతోషం నింపాయి. సంక్షేమ పథకాలు గుణాత్మక మార్పు, ప్రగతిశీల ప్రభావం చూపించాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు దండిగా భరోసానిస్తున్న సీఎం కేసీఆర్.. తాజాగా వారికి గూడు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ఈ పథకం అమలు కావాల్సి ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆర్థిక వెసులుబాటు లభించడంతో సర్కారు ‘గృహలక్ష్మి’ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల ఇండ్లకు ఆర్థిక సాయం చేయనుండడంతో ఉమ్మడి జిల్లాలో 27 వేల మందికి ప్రయోజనం కలుగనున్నది.
నెరవేరనున్న కల..
ప్రభుత్వం పేదల కోణంలో ఆలోచించి ఇది వరకు అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నట్లే గృహలక్ష్మి పథకం కూడా ఎంతో ఉపయోగ పడనున్నది. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఈ పథకం ఎంతో దోహదం చేయనున్నది. సంపాదన అంతా ఇంటి పోషణ, పిల్లల చదువు, పెండ్లిల్లకే సరి పోతున్న వారెందరికో ఈ పథకం వరంగా మారనున్నది.
గూడు అవసరమైన వారు ఎక్కువగా ఉండడంతో డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటనను ఎంతో సానుకూలంగా స్వీకరించారు పేదలు. ఆడబిడ్డలకు మేన మామలా కల్యాణలక్ష్మి, రైతుగా అన్నదాతలకు రైతుబంధు, రైతుబీమా, అన్నలా అమ్మ ఒడి, ఒంటరి మహిళలకు పింఛను, కొడుకులా పండుటాకులకు వృద్ధాప్య పింఛను తదితర పథకాలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఇండ్లు లేని పేదలకు గృహలక్ష్మి పథకంతో పెద్ద దిక్కులా నిలుస్తున్నారు. సొంత ఇల్లు లేక ఒకే ఇంట్లో ఉంటూ ఇబ్బందిగా జీవితాలు వెల్లదీస్తున్న వారు, సొంత జాగాల్లో రేకుల షెడ్డు వేసుకొని కాలం వెల్లదీస్తున్న వారు, సంపాదనలో కొంత ఇంటి అద్దెకే ఖర్చయి పోతున్న వారు, అద్దె ఇంటి కష్టాలు అనుభవిస్తూ సొంత ఇంటి గౌరవాన్ని కోరుకునే వారెందరో గృహ లక్ష్మీ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నా బిడ్డల కండ్లల్ల ఆనందం గనవడ్డది..
సొంత జాగా ఉన్నోల్లకు ఇల్లు గట్టుకోనీకి మూడు లక్షల రూపాలు ఇచ్చే స్కీము ముందట వడ్డదని మా కాలనీల ముచ్చట వెట్టుకోంగ మాకు ఇనవడ్డది. గీ ముచ్చట ఇన్న మా బిడ్డల కండ్లల్ల ఆనందం గనవడ్డది. ఇగ మాకు సుక సొంతం ఇల్లు అయితది. మత్తు రోజుల సంది అంటున్నరు గీ స్కీము గురించి. కని ఇంకా అత్త లేదని మంది మాట్లాడగ ఇన్న. కని కరోనచ్చింది. గొంచెం సర్కార్ దగ్గర పైసలకు తిప్పలయింది అనేది సుక ఇన్న. గది నిజమే గద అనిపిసు్ంతడేడిది. గొంచెం సేయి తిర్గంగనే కేసీఆర్ సారు తప్పకుంట సొంత ఇంటికి పైసలు ఇస్తడనే నమ్మకముండేడిది. గిప్పుడు ఇచ్చే పని షురు జెయ్యనేవట్టే. ఇగనన్న మాయసోంటోల్ల ఇండ్లు లేనోళ్ల బాధ తీరిపోతది.
– బోదాసు యశోద, దమ్మన్నపేట్, మం: కమ్మర్పల్లి