కామారెడ్డి, మే 27 : ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రజలు తాము సురక్షితంగా ఉన్నామనే భావన కలిగేలా పోలీసులు పనిచేయాలని సూచించారు. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని, తద్వారా వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడమే కాకుండా నేరాలను కూడా తగ్గించవచ్చని తెలిపారు.
ప్రతి కేసులో సమర్థవంతమైన, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల నమ్మకాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. హైవే అథారిటీ, రవాణా శాఖతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తరచూ ప్రాపర్టీ నేరాలకు పాల్పడే వారే మళ్లీ నేరాలు చేస్తున్నారని, అలాంటివారిపై నిరంతర నిఘా ఉంచాలన్నారు.
అనంతరం డీజీపీ జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. సమావేశంలో ఐపీఎస్ మల్టీ జోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి, అదనపు ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీకి ఎస్పీ రాజేశ్చంద్ర పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.