బాన్సువాడ, ఫిబ్రవరి 25: సీఎం కేసీఆర్ నిజమైన భక్తుడని, ఆధ్యాత్మికతపై చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. తెలంగాణ తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ యాదాద్రిని కృష్ణశిల్పంతో నిర్మించారని, పూర్వం రాజులు ఆలయాలను శిల్పాలతో కట్టించేవారని… ఇప్పుడు శిల్పాలతో కట్టించిన ఏకైక వ్యక్తిగా సీఎం కేసీఆర్ నిలిచారని అన్నారు. యాదాద్రిలో కల్పిస్తున్న సదుపాయాలన్నీ తెలంగాణ తిరుమల తిరుపతిలో ఏర్పాటు చేశామని వివరించారు. 2016లో సీఎం కేసీఆర్ మొదటిసారి వచ్చినప్పుడు కేవలం గర్భగుడి, మండపం మాత్రమే మా సొంత నిధులతో కట్టించామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తిరుమల కొండపై సుదర్శనయాగం చేయించామన్నారు.
ఆ యాగం అనంతరం దర్శనం చేసుకున్న తర్వాత సీఎం సహకారంతో నేటి వరకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.23కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఆ నిధులతో భక్తులకు, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. మార్చి 1న స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ వస్తారని పేర్కొన్నారు. సీఎం చేతుల మీదుగా మాఢవీధులు, ప్రాకారం, కల్యాణకట్ట, కల్యాణమండపం, రాజగోపురాలు, గాలి గోపురాలు, యజ్ఞశాల, స్వామివారి కల్యాణమండప సముదాయాలను ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గంలోని ఆలయాలకు రూ.వందకోట్లతోపాటు మైనార్టీలకు ఈద్గా, మసీదు తదితర వాటికి రూ.20కోట్లు, క్రైస్తవుల చర్చిలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అన్నిమతాలను సమానంగా చూస్తున్నామని తెలిపారు. ఆయన వెంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, గంగుల గంగారాం, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, పిట్ల శ్రీధర్, మహ్మద్ ఎజాస్, దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, భూషణ్ రెడ్డి, నార్ల ఉదయ్ గుప్తా, కౌన్సిలర్లు వెంకటేశ్, లింగం, అందెరాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.