మోర్తాడ్, జూలై 1: ఎస్సీరెస్పీ ఎగువన ఉన్న మహారాష్ట్రలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ గేట్లను త్రిసభ్యకమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎత్తివేశారు. ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తివేసి దిగవకు నీటిని విడుదల చేయడంతో ఎస్సారెస్పీలోకి చేరనున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరుకు జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు తెరచి ఉంచాలి.
దీంతో బాబ్లీ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన వర్షపు నీరంతా ఎస్సారెస్పీకి రానున్నది. మంగళవారం బాబ్లీ నుంచి ఒక టీఎంసీ నీరు ఎస్సారెస్పీకి చేరుకోనున్నదని అధికారులు తెలిపారు. ఓ వైపు బాబ్లీ గేట్లు ఎత్తివేయడం, వర్షాలు కూడా కురుస్తుండడంతో ఎస్సారెస్పీలోకి వరద పెరిగే అవకాశం ఉన్నది. దీంతో వానకాలం పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్‌రావు గుప్తా, సీడబ్ల్యూసీ సభ్యుడు ఫ్రాంక్లిన్, ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి, ఏఈఈ కొత్తరవి పాల్గొన్నారు.