పెద్దకొడప్గల్, ఆగస్టు 12: రెవెన్యూ అధికారుల ధన దాహానికి రైతులు బలవుతున్నా రు. ఏ పని కావాలన్నా డబ్బులు గుంజుతున్నారు. పైసలు తీసుకున్నాక పని చేయకుండా సతాయిస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అన్నదాతలు విసిగి పోతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆవేదనకు గురైన ఓ రైతు సోమవారం పెద్దకొడప్గల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం అధికారులు ప్రజావాణి నిర్వహిస్తుండగా, పురుగుల మందు తాగాడు. కలకలం రేపిన ఈ ఘటనతో రెవెన్యూ అధికారుల దోపిడీ మరోమారు తెరపైకి వచ్చింది. పనుల కోసం వచ్చే వారిని పీడించుకుంటున్న తింటున్న వైనంపై జోరుగా చర్చ సాగుతున్నది.
రేపు, మాపు అంటూ..
పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన జీపీ కార్మికుడు గైని అంజయ్య కుటుంబానికి గ్రా మ శివారులోని సర్వే నం.134/3లో 3.14 ఎకరాల భూమి ఉంది. అన్నదమ్ముల పేరిట ఉన్న ఆ భూమిని తన పేరిట చేయాలని అంజయ్య ఆర్నెళ్ల క్రితం ఆర్ఐ పండరి వద్దకు వెళ్లాడు. ఆ సర్వే నంబర్‌కు సంబంధించిన భూమి వివాదాస్పద (పార్ట్-బీ) జాబితాలో ఉందని అధికారి భయపెట్టాడు. రూ.20 వేలు ఇస్తే పార్ట్-బీ నుంచి తొలగించి పట్టా చేసిస్తానని ఆర్ఐ చెప్పాడు. దీంతో అక్కడ ఇక్కడ అడిగి అప్పు చేసి ఆ మొత్తాన్ని అంజయ్య గత ఫిబ్రవరిలోనే అధికారి చేతిలో పెట్టాడు. సొమ్ము తీసుకున్న సదరు రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ ఆర్నెళ్లు గడిపాడు. పనులన్నీ వదిలేసి అంజయ్య ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఎప్పుడు వెళ్లినా రేపు, మాపు అంటూ సమాధానమే వస్తున్నది. దీంతో విసిగిపోయిన ఆయన అధికారుల తీరుపై జూలై 31న ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ స్పందన లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి, చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న అంజయ్య అలసిపోయాడు. సోమవారం మండలాఫీసులో ప్రజావాణి కార్యక్రమం నడుస్తుండగానే, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న కొందరు వెంటనే అతడ్ని స్థానిక దవాఖానకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బాన్సువాడకు తరలించారు.
డబ్బుల విషయం తెలియదు..
అంజయ్య దరఖాస్తు చేసింది వాస్తవమేనని తహసీల్దార్ దశరథ్ తెలిపారు. పార్ట్-బీలో ఉండడంతో ప ట్టా మార్పిడి ఇప్పుడైతే కాదు, తర్వాత చేద్దామని చె ప్పానన్నారు. డబ్బులు తీసుకున్న విషయం తన దృ ష్టికి రాలేదని,ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు.