నాగిరెడ్డిపేట, అక్టోబర్16: నాగిరెడ్డిపేటలోని వసతిగృహంలో అధికారులు, సిబ్బంది పత్తా లేకుండా పోయారు. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు భయంతో రోదిస్తూ బయటికి వచ్చారు. అసలేం జరిగిందంటే.. దసరా పండుగకు హాస్టల్కు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ వసతిగృహంలో వంద మందికి పైగా ఉండగా, బుధవారం ఇద్దరు విద్యార్థులు కిశోర్, హరీశ్ మాత్రమే తిరిగి వచ్చారు.
సాయంత్రం భోజనం పెట్టిన కామాటి ఇంటికి వెళ్లిపోగా, నైట్ వాచ్మన్ అన్వర్ కూడా బయటికి వెళ్లాడు. రాత్రి అవుతుండడం, హాస్టల్లో కిశోర్, రాకేశ్ మాత్రమే ఉండడంతో వారు భయానికి లోనయ్యారు . దీంతో రోదిస్తూ బయటకు రాగా, గమనించిన స్థానికులు ఏం జరిగిందని ఆరా తీయగా జరిగిన విషయం చెప్పారు. దీంతో స్థానికులు హాస్టల్ వార్డెన్ రాములుకు ఫోన్ చేయగా, నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
అదే సమయంలో హాస్టల్కు వచ్చిన వాచ్మన్ అన్వర్ మద్యం మత్తులో ఉన్నాడు. అతడ్ని ప్రశ్నిస్తే తనకు, పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని, తన డ్యూటీ కేవలం రాత్రి వచ్చి పడుకుని ఉదయం వెళ్లడమేనని దురుసుగా చెప్పాడు. విద్యార్థుల పరిస్థితిని గమనించిన స్థానికులు.. వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు బంధువులను పంపించగా, పిల్లలను వారికి అప్పగించారు.