నిజామాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురుకులాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నిర్వాహకుల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. ఫలితంగా గురుకులాల పరిస్థితి మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న చందంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఎంతో ఆదరణకు నోచుకున్న గురుకులాలు.. నేడు అస్తవ్యస్తంగా మారాయి.
గురుకుల విద్యాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపంగా మారింది. విద్యాలయంలో అడుగుడుగునా లోపాలు బయటపడుతున్నాయి. విద్యార్థులకు నాసిరకం భోజనం అందిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అన్నంతోపాటు కూరలు, చివరికీ నీళ్లలోనూ పురుగులు వస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గురుకులాల నిర్వహణలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుందనడానికి తమకు నిత్యం పురుగులతో భోజనం పెడుతున్నారంటూ ఎల్లారెడ్డి ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థినులు సోమవారం రోడ్డెక్కి ఆందోళన చేయడమే నిదర్శనం.
ఉమ్మడి జిల్లాలోని గురుకులాల విద్యాలయాల్లో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఎల్లారెడ్డి మండలంలో ఎస్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు రోడ్డు ఎక్కి ఆందోళన చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది. అన్నంతోపాటు చివరికి తాగే నీళ్లలోనూ స్వచ్ఛత లేకుండా పోయిందని, అందులోనూ పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతుంటే వారి దయనీయ పరిస్థితి ఎంత తీ వ్రంగా ఉన్నదో తెలియజేస్తున్నది. ఎల్లారెడ్డి ఎస్టీ గురుకులంలోనే కాకుండా ఉమ్మడి జిల్లాలోనూ పదుల సంఖ్యలో గురుకులాల్లో ఇలాంటి పరిస్థితే దాపురించింది. భోజన మెనూ అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండగా.. టైం టేబుల్ ప్రకారం ఆహారాన్ని అందివ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి మాటలను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులే పట్టించుకోవడం లేదు. ఇందుకు గురుకులాలు, వసతి గృహాల తనిఖీల అంశమే నిదర్శనం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, లక్ష్మీకాంతారావు, మదన్మోహన్ రావు రాత్రి బస చేసేందుకు చొరవ చూపిన సందర్భాలు లేవు. ఎంపీ సురేశ్ షెట్కార్ కనీసం తన పరిధిలోని గురుకులాలను తనిఖీ సైతం చేసిన దాఖలాలు లేవు. వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఉన్నవారు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కనీసం ఈ అంశాన్ని పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి అడపా దడపా తనిఖీలు చేస్తున్నప్పటికీ రాత్రి బస చేయలేదు. ఎవరికి వారు బాధ్యతగా తీసుకుని గురుకులాల్లో తరచూ తనిఖీ చేపడితే సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతుంది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు లాభం చేకూరుతుందని అందరూ భావిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గురుకులాల్లో నిర్వహణ అధ్వానంగా మారింది. గురుకులాల్లో పాలన గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గత విద్యా సంవత్సరంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గురుకులాల్లో లోపాలను నివారించేందుకు నిరంతరం తనిఖీలు చేయాలంటూ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతోపాటు ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు, ఇన్చార్జి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలతోపాటు గురుకులాల్లో వడ్డించే భోజనాన్ని తిని అక్కడే ఒక రోజు బస చేయాలని సూచించారు. కానీ సీఎం ఆదేశాలు మాటలకే పరిమితమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటివరకు సీఎం ఆదేశాలను పాటించిన దాఖలాలు కనిపించడంలేదు.
గతేడాది నిజామాబాద్ పూర్వ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తూతూ మంత్రంగా ఆఫీస్ కార్యాలయాన్ని వదిలి తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో కలిసి నిద్రించారు. లోటుపాట్లపై వివరాలు సేకరించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇంతలోనే విద్యా సంవత్సరం ముగిసింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి నూతన కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి వచ్చారు. కొత్త కలెక్టర్ ఇప్పటి వరకు తనిఖీలు చేపట్టలేదు. రాత్రి బస చేయలేదు.
కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ విసృతంగా పర్యటిస్తూ, తనదైన శైలిలో హడలెత్తిస్తున్నారు. కాకపోతే గురుకులాల్లో రాత్రి బస అనేది లేకుండా పోయింది. వారంలో నాలుగైదు స్కూళ్లను తనిఖీలు నిర్వహిస్తూ ఉపాధ్యాయుల పనితీరును గమనిస్తున్నారు. విద్యార్థులకు అందిస్తున్న మౌలిక సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. బోధనా పద్ధతులను తెలుసుకుంటున్నారు.
ఎల్లారెడ్డి రూరల్, జూలై 8: ఆర్థిక పరిస్థితి బాగోలేక పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పిస్తారు. పాఠశాలలో సరైన పర్యవేక్షణ లేక నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఎల్లారెడ్డి ఎస్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు పెట్టిన కిచిడిలో పురుగులు రావడంతో వారు తినకుండా పస్తులు ఉన్నారు. పురుగులు పట్టిన తిండి తినడంతో పిల్లలకు తరచుగా కడుపు నొప్పి వస్తుంది. ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉంటే పిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
-కొండంగారి రాములు, ఎల్లారెడ్డి
అన్ని సౌకర్యాలు ఉంటాయని గురుకులాల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటారు. విద్యార్థులకు పురుగులు పట్టిన అన్నం పెడితే తట్టుకుంటారా? పిల్లలకు పెట్టే స్నాక్స్లోనూ పురుగులు రావడం దారుణం. మన ఇంట్ల అట్లనే తింటామా?. పిల్లలు తమ బాధలు చెప్పుకోవడానికి భయపడుతున్నారు ప్రిన్సిపాల్, టీచర్లు తమను టార్గెట్ చేస్తారని. గురుకుల పాఠశాలలు, వసతిగృహాలు, స్కూళ్లకు అధికారులు సమాచారం ఇచ్చి తనిఖీ చేయడం సబబుకాదు. ఆకస్మిక తనిఖీ చేపడితేనే వాస్తవాలు తెలుస్తాయి.
-జక్కుల యాదగిరి, ఎల్లారెడ్డి
మా చుట్టాల పిల్లలు ఇద్దరు, ముగ్గురు ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నరు. సోమవారం పిల్లలు ఆందోళన చేస్తున్నారని తెలిసి నేను కూడా వచ్చాను. ఎన్ని ఇబ్బందులు పడితే ఆడపిల్లలు రోడ్డుమీదికి వచ్చి ఆందోళన చేస్తరు. అధికారులు ఆలోచన చేయాలి.ప్రిన్సిపాల్, టీచర్లు వారి పిల్లలకు ఇలా పురుగుల అన్నం, పప్పు, కిచిడీ, నీళ్ల చారుతో భోజనం పెడతారా? అదనపు కలెక్టర్ విక్టర్ వచ్చి న్యాయం చేస్తామని చెప్పాడు.
-మోతీరాం నాయ క్ – సోమారం తండా, గాంధారి