ఎల్లారెడ్డి రూరల్, జనవరి 30: ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు మరోమారు కడుపునొప్పితో సతమతమయ్యారు. దీంతో గురువారం ఉదయం వారిని దవాఖానలో చేర్పించారు. బుధవారం భోజనం తిన్న పిల్లలు వాంతులు, కడుపునొప్పితో బాధ పడగా దవాఖానలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం కుదుటపడడంతో రాత్రికే ఇంటికి పంపించారు. అయితే, గురువారం ఉదయం నుంచి కడుపునొప్పి రావడంతో వారిని వెంటనే దవాఖానకు తీసుకెళ్లారు. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, నాణ్యమైన వైద్యం అందించాలని తల్లిదండ్రులు కోరారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని, రెండు, మూడ్రోజుల్లో తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు. దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆర్డీవో ప్రభాకర్ పరామర్శించారు.
ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. హెడ్మాస్టర్పై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాఠశాలను తనిఖీ చేశారు. అనారోగ్యం పాలైన విద్యార్థుల వివరాలను తెలుసుకొని, వారిని పిలిపించి మాట్లాడారు. ఏజెన్సీలో వంట సామగ్రి, సరుకులను పరిశీలించిన ఆయన ఫుడ్ పాయిజనింగ్ ఎలా అయిందో ఫుడ్ సేఫ్టీ అధికారి శిరీషను అడిగి తెలుసుకున్నారు. వెంటనే మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలిని తొలగించి కొత్త వారిని పెట్టాలని ఆదేశించారు. అంతకు ముందు ఇన్చార్జి డీఈవో బల్రాం, ఫుడ్ సేఫ్టీ అధికారి శిరీష పాఠశాలకు వచ్చి స్టోర్ రూంను, సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఇన్చార్జి తహసీల్దార్ చరణ్‌సింగ్, ఎంఈవో వెంకటేశం ఉన్నారు.