కామారెడ్డి, జూలై 14 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్‌ను సోమవారం ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సుమారు రూ.8 వేల కోట్లకు పైగా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో ఉంచి విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని తెలిపారు.
విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నదన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, నాయకులు స్టాలిన్, మణికంఠ, రాహుల్, నితిన్, నవీన్, సాయిప్రకాశ్ గౌడ్, మణిరాజ్, రాఘవ, ప్రభు, అర్జున్, సాయి తదితరులు పాల్గొన్నారు.