నిజాంసాగర్, డిసెంబర్17: వారంతా ఒకే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని నేడు వేర్వేరు రంగాల్లో వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. 31 బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, వారంతా ఒక్కచోట కలుసుకునేందుకు చిన్ననాడు చదువుకున్న నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయమే వేదికైంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయసమ్మేళనానికి వివిధ రాష్ర్టాలతోపాటు విదేశాల్లో స్థిరపడినవారు కూడా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటాపాటలతో సరదాగా గడిపారు. చిన్ననాటి చిలిపి పనులు, మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ప్రస్తుతం వారు స్థిరపడ్డ రంగాలు, అనుభవాలను మిత్రులతో పంచుకున్నారు. చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.
పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నవోదయ పాఠశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కామారెడ్డికి చెందిన ఒకటో బ్యాచ్ విద్యార్థిని శ్రీవాణి ప్రస్తుతం జార్జియా దేశంలో విద్యాశాఖ అడ్వైజరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె రూ. లక్షా 60వేల విరాళాన్ని అందజేయగా.. నవోదయలో బాలికల డైనింగ్ హాల్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యవతి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వినయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, కోశాధికారి రేణుకాకుమారి, నాగవేందర్, ఇమ్మానుయేల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.