హైదరాబాద్/పెద్దపల్లి/మంథని/ కోరుట్ల/కుమ్రం భీం ఆసిఫాబాద్ : దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలైన ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు సీనియర్ మావోయిస్టు మల్లా రాజిరెడ్డి సహా 20 మందికి పైగా మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆసిఫాబాద్ అడవుల్లో ఆ ఇద్దరితోపాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడైన నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న కూడా ఉన్నట్టు తెలిసింది. వీరిని తెలంగాణ ఎస్ఐబీ పోలీసులు హైదరాబాద్‌కు తరలించినట్టు సమాచారం. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో వీరి లొంగుబాటును చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.
ఈ ఇద్దరి లొంగుబాటును ప్రభుత్వం తన క్రెడిట్‌గా చూపించుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే పక్కా సమాచారం మేరకు కేంద్ర బలగాలకు తోడు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ బలగాలు వేలాది సంఖ్యలో మోహరించడంతో.. శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది. వీరి లొంగుబాటు గురించి ఎప్పటి నుంచో వేచిచూస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు తెలిసింది. మొత్తానికి మావోయిస్టు అగ్రనాయకత్వం లొంగిపోవడం సంచలనంగా మారింది. దేవ్‌జీ, రాజిరెడ్డి లొంగుబాటుకు అంగీకరించిన కేంద్రం పెద్ద లు.. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లొంగుబాటుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా, మావోయిస్టులను కోర్టులో హాజరుపర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు డిమాండ్ చేశారు.
నిరుడు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్‌రావ్ మరణం తర్వాత పార్టీ నాయకత్వానికి దేవ్‌జీ సారథ్యం వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ లొంగిపోయాడనే సమాచారం మీడియా ద్వారా తెలియడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. ఆదివారం తమ నివాసంలో కుటుంబసభ్యులు స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు ఆయన తల్లిదండ్రులు తిప్పిరి వెంకటనర్సయ్య, గంగుబాయి. తమ్ముళ్లు వెంకటి, గంగాధర్, సోదరి లీలమ్మ. కోరుట్ల పట్టణంలోని అంబేదర్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాలలో ఆరో తరగతి వరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏడో తరగతి నుంచి 12 వరకు చదువుకున్నారు. 1984 నుంచి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశారు. 1983లో పార్టీ భావజాలంపై ఆకర్షితులై ఆర్ఎస్యూ లో చేరారు. పీపుల్స్ వార్‌లో దళ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన తిరుపతి అంచెలంచెలుగా ఎదిగారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, దళ కమాండర్‌గా, జోనల్ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ప్లాటూన్ కమాండర్‌గా, ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ మిలటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. నంబాల కేశవరావు మరణం తర్వాత, మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిరుపతి నియమితులయ్యారు. మిలీషియా దాడుల వ్యూహకర్తగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రటరీగా దేవ్‌జీ పనిచేస్తున్నారు.
‘పెద్దనాన్న మీరు లొంగిపోవాలి. క్షేమంగా మా వద్దకు తిరిగి రావాలి’ అని కోరుతూ తిరుపతి అలియాస్ దేవ్‌జీ తమ్ముడు గంగాధర్ కూతురు సుమ సోషల్ మీడియా వేదికగా గతంలో బహిరంగ లేఖ రాశారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మరణించిన సమయంలో సుమ భయాందోళనకు గురై ఆ లేఖ రాయగా, అప్పట్లో అది వైరల్‌గా మారింది. ఇప్పుడు లొంగిపోయారన్న సమాచారంతో సుమ మరో వీడియో పోస్టు చేశారు. ‘మా పెద్దనాన్న దేవ్‌జీ లొంగుబాటు వాస్తవమైతే.. అది కేవలం లొంగుబాటు కాదు. అది ఎన్నో ఏండ్ల ఎదురుచూపు’ అంటూ తన వీడియోలో పేరొన్నది.
మావోయిస్టు సంచలన నేతగా గుర్తింపు పొంది, సుదీర్ఘకాలం అజ్ఞాత జీవితం గడిపిన కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్నది పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శాస్త్రులపల్లి గ్రామం. మావోయిస్టు పార్టీని పలు రాష్ర్టాల్లో విస్తరించడానికి, బలపర్చడానికి వ్యూహకర్తగా, ప్రజా శత్రువుల నిర్మూలన కోసం నిర్వహించే ఆపరేషన్లలో కీలక నేతగా గుర్తింపు పొందారు. రాజిరెడ్డి 50 ఏండ్ల క్రితమే విద్యార్థి దశ నుంచి విప్లవోద్యమ బాట పట్టారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడి స్థాయికి ఎదిగారు. రాజిరెడ్డి భార్య కూడా ఉద్యమ విస్తరణ కోసం పనిచేశారు. 15 ఏండ్ల పాటు పనిచేసిన రత్తమ్మ ప్రజా పోరులోనే ఎన్కౌంటర్లో అసువులుబాశారు. రాజిరెడ్డిపై రూ.కోటికి పైగా రివార్డును ప్రకటించారు.
ప్రజల కోసం 50 ఏండ్లకు పైగా ప్రజా ఉద్యమంలో పనిచేసిన మా అన్న రాజిరెడ్డి లొంగిపోతే మాకు చాలా సంతోషం. గతంలోనూ ఇలానే పలుసార్లు వార్తలొచ్చాయి కానీ, అవి నిజం కాలేదు. మా బాపు, అమ్మ చనిపోయినప్పుడు కూడా అన్న చివరిచూపు కోసం రాలేదు. 50 ఏండ్లకు పైగా ప్రజల కోసమే పనిచేశారు. మా అన్న లొంగిపోయి ఇంటికి వస్తున్నాడంటే పట్టరానంత సంతోషంగా ఉన్నది.