డిచ్పల్ల్లి, మార్చి 13: త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనలపై సర్వత్రా ఆగ్రహం పెల్లబుకింది. సర్కారు తీరుపై విమర్శల సునామీ వెల్లువెత్తింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అదే సమయంలో తెలంగాణ అస్తిత్వానికి ముప్పుగా పరిణమించిన సర్కారు చర్యలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం కదలిక తెప్పించింది. పరిస్థితి చేయిదాటుతుండడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పేరు మార్పు అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది.
తెలంగాణ విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి పేరును పెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రయత్నించడంతో వివాదం మొదలైంది. వర్సిటీ పేరు మార్పుపై నివేదిక ఇవ్వాలని విద్యామండలి నుంచి ఆదేశాలు రావడంతో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు నివేదిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇటు విద్యార్థి సంఘాలతో పాటు అటు ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. ఎన్నో పోరాటాల ద్వారా 2007 సెప్టెంబర్ 11న తెలంగాణ ప్రాంతం పేరిట ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ పేరును.. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మారిస్తే మరోసారి ఉద్యమాలు తప్పవని హెచ్చరించాయి. ఇప్పటికే వర్సిటీలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
పేరు మార్పు ప్రతిపాదనలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తుతు న్న ప్రజాగ్రహాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత వస్తుందని తెలిపారు. దీంతో టీయూ పేరు మార్పు విషయంలో ఎలాంటి కార్యాచరణ చేపట్టవద్దని సీఎం ఆదేశించారు. దీంతో పేరు మార్పుపై ఎలాంటి నివేదికా అవసరం లేదని ఉన్నత విద్యామండలి నుంచి విశ్వవిద్యాలయానికి సమాచారమందింది. ఈ విషయాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై ఇంకెప్పుడైనా ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర వ్యతిరేక తప్పదని విద్యార్థి, ప్రజా సంఘాలు హెచ్చరించాయి.
విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ విశ్వవిద్యాలయం పునాది వేసుకున్నది. వర్సిటీ కోసం ఎంతో మంది విద్యార్థులు లాఠీదెబ్బలు తిన్నారు. తెలంగాణ అంటేనే రాష్ట్ర ఆత్మగౌరవం. అలాంటిది రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీ పేరు మార్చుతామనడం దురదృష్టకరం. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అగౌరవపరిచే ఇలాంటి చర్యలు మంచివి కావు.
– డాక్టర్ సిద్దలక్ష్మి, టీయూ పూర్వ విద్యార్థి