కామారెడ్డి, ఫిబ్రవరి 26: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాల నాయకులు గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ.. 1964లో ఏర్పడిన కాలేజీ ఎడ్యుకేషన్ సొసైటీకి రైతుల నుంచి 268 ఎకరాల భూమిని సేకరించి అప్పగించారని అన్నారు. ఆ భూములను కాపాడడంలో సొసైటీ సభ్యులు విఫలమయ్యారని ఆరోపించారు. రైతుల కష్టార్జితమైన ఆ భూములను కబ్జా కాకుండా చూస్తామన్నారు. కాలేజీ భూముల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. విద్యార్థి సంఘాల నాయకులు ఆజాద్, సందీప్, విఠల్, అరుణ్, లక్ష్మణ్, నాగరాజు, వినయ్, భరత్, వినోద్, సోఫియాన్, డేవిడ్, రాహుల్ పాల్గొన్నారు.