రుద్రూర్, ఆగస్టు 31 : మండలంలోని అక్బర్‌నగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లింగవాడ్ రక్షిత (16) వసతిగృహంలోని బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. హాస్టల్లో చేరిన నాలుగు రోజులకే మృతిచెందడం, తాము రాకముందే పోలీసులు పోస్టుమార్టానికి తరలించడం, హాస్టల్లోని సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన లింగావడ్ రక్షిత నాలుగు రోజుల క్రితమే కళాశాల వసతిగృహంలో చేరింది. అయితే, బాత్రూంలో ఉరేసుకొని మృతిచెందినట్లు శనివారం ఉదయం గుర్తించిన తోటి విద్యార్థులు.. వెంటనే కళాశాల అధికారులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన పోలీసులకు సమాచారమివ్వ గా, సీఐ జయేశ్ రెడ్డి, ఎస్సై సాయన్న ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
నాలుగు రోజుల క్రితమే కళాశాల వసతిగృహంలో చేరి, విగతజీవిగా మారడంపై తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు అత్యుత్సాహంతో తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించడంపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుపాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో వసతిగృహం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, కారకులు ఎవరైనా ఉంటే చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ సముదాయించారు. హాస్టల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా విద్యార్థిని ఆత్మహత్య ఘటనకు సంబంధించిన ముందు దృశ్యాలు రికార్డు కాకపోవడంపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ సమస్యతో రికార్డు కాకపోయి ఉండొచ్చని ప్రిన్సిపాల్ బాలాజీనాయక్ తెలుపగా.. టెక్నీషియన్‌ను పిలిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ చేపడతామని సముదాయించడంతో ఆందోళన విరమించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ జయేశ్ రెడ్డి, రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు.